వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది వలసకూలీల మృతి

14 May, 2020 09:28 IST|Sakshi

భోపాల్‌ : లాక్‌డౌన్‌ వలసకూలీల పాలిట శాపంగా మారింది. ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో కాలినడకన సొంతూర్ల బాట పట్టిన వలసకూలీలు వరుసగా రోడ్డు ప్రమాదాల బారీన పడుతున్నారు.  తాజాగా మధ్యప్రదేశ్, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ల్రాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 14 మంది వలస కూలీలు మృతి చెందారు. వివరాలు.. మధ్యప్రదేశ్‌‌లోని గునా జిల్లా కాంట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం అర్థరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది వలస కూలీలు మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.కాగా ప్రమాద సమయంలో ట్రక్కుల్లో మొత్తం 60 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరంతా మహారాష్ట్ర నుంచి స్వరాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు వెళ్తుండగా ప్రమాదం బారీన పడ్డారు.  వలస కూలీలతో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

వలసకూలీలపైకి దూసుకెళ్లిన బస్సు
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌-సహరాన్పూర్‌ రహదారిపై  గురువారం తెల్లవారుజామున జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఆరుగురు వలస కూలీలు మృతి చెందారు. రోడ్డు వెంబడి స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలపైకి వేగంగా వచ్చిన బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు వలస కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంజాబ్‌ నుంచి తమ స్వస్థలమైన బీహార్‌కు కాలినడకన నడుచుకుంటూ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా మృతి చెందిన వారిలో హరేక్‌ సింగ్‌(52), వికాస్‌(22), గుధ్‌(18),వాసుదేవ్‌(22), హరీష్‌ సహాని(42), వీరేంద్ర( 28)లు ఉన్నారు.

మరిన్ని వార్తలు