ఉద్యోగం పేరుతో ఘరానా మోసం

24 Sep, 2019 09:40 IST|Sakshi
ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేస్తున్న బాధితులు

సాక్షి, తిరుపతి : ఉద్యోగం పేరుతో ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని మోసగించాడని బాధితులు అర్బన్‌ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. అర్బన్‌ జిల్లాలోని ప్రతి పోలీస్‌ స్టేషన్లో ఉదయం 9నుంచి సాయంత్రం వరకు అదనపు ఎస్పీ నుంచి ఎస్‌ఐ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రశీదు అందించారు. ఇందులో ఎస్పీ కార్యాలయానికి 60 ఫిర్యాదులు, జిల్లా వ్యాప్తంగా 21 ఫిర్యాదులు అందాయని ఎస్పీ వెల్లడించారు. తిరుపతి సంజయ్‌గాంధీకాలనీలో నివాసముంటున్న రూప్‌కుమార్‌ బీవీఎం డిగ్రీ చదివాడు. ఆన్‌లైన్‌లో విదేశాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ట్రూవిన్‌ సొల్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామచంద్రన్, ఆ సంస్థ సభ్యులు కాల్‌చేసి ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు.

రూ.లక్ష డిపాజిట్‌ చేయాలని కోరారు. దీంతో వారిని నమ్మి మెడికల్, ఇతర ఖర్చుల కోసం రూ.5.50లక్షలు అకౌంట్‌లో డిపాజిట్‌ చేశానని రూప్‌కుమార్‌ తెలిపాడు. అయితే వారు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయాడు. దీనిపై స్పందించిన ఎస్పీ, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి కేసును అలిపిరి పోలీసుస్టేషన్‌కు సిఫార్సు చేశారు. పోలీసుస్టేషన్ల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. దీంతోపాటు ప్రతి ఫిర్యాదు సంబంధిత పోలీస్‌స్టేషన్‌కి పంపి చర్యలు తీసుకునేలా ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. కేసులపై తీసుకున్న చర్యలు తిరిగి ఎస్పీ కార్యాలయానికి అందేలా ఆదేశాలు జారీ చేశారు. 

మరిన్ని వార్తలు