శిఖాను విచారించనున్న హైదరాబాద్‌ పోలీసులు

8 Feb, 2019 07:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్, కోస్టల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ చిగురుపాటి జయరామ్‌ హత్య కేసు దర్యాప్తును హైదరాబాద్‌ పోలీసులు ముమ్మరం చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని నందిగామ పోలీసుల నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌ పోలీసులకు ఈ కేసు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు శిఖా చౌదరి ప్రియుడే అని ఏపీ పోలీసులు తేల్చగా.. జయరామ్‌ భార్య పద్మశ్రీ దానిని ఖండించారు. జయరామ్‌ మేనకోడలు శిఖా పాత్రే ఈ కేసులో ప్రధానంగా ఉందని.. తన భర్త చావుకు శిఖాయే కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జయరామ్‌ హత్యకేసును మొదటినుంచి దర్యాప్తు చేయాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. జయరామ్‌ మామయ్య గుత్తా పిచ్చయ్య ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 419, 342, 346, 348, 302, 201, రెడ్‌విత్‌ 34 కింద కేసు నమోదు చేసుకున్నారు. ఏపీలో ఉన్న కేసు నిందితులను ఈరోజు హైదరాబాద్‌కు తరలించనున్నారు. హైదరాబాద్‌ చేరుకున్న అనంతరం శిఖాను పోలీసులు విచారించనున్నారు. (జయరామ్‌ హత్య కేసు మొదట్నుంచి మళ్లీ!)

కీలకంగా మారనున్న ‘రీ–కన్‌స్ట్రక్షన్‌’...
రంగంలోకి దిగిన పోలీసులు,  క్లూస్‌ టీమ్‌లు, పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. జయరామ్‌ కారును స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ నోటీసులు జారీ చేశారు. శిఖా చౌదరి ప్రియుడి ఫ్లాట్‌ నుంచి ఐతవరం టోల్‌గేట్‌ వరకు సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు. క్రైమ్‌ సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ ప్రక్రియ కీలకం కానుంది. శిఖా ఇంట్లో అనేక అంశాలు పరిశీలించ నున్నారు. ఆపై గొడవ జరిగిన తీరు, మృతదేహాన్ని కారులోకి వాచ్‌మన్‌ సాయంతో తరలించిన తీరు సహా నందిగామ వరకు జరిగిన పరిణామాలను సరిచూస్తారు. ఈలోపే పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ సేకరించడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో సీసీ కెమెరాలు కీలకం కానున్నాయి. జయరామ్‌తో పాటు, నిందితుల కాల్ లిస్ట్, సెల్‌ఫోన్‌ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా కేసును విచారించనున్నారు. హత్య వెనక దాగిన కుట్ర, జయరాం కుటుంబం లేవనెత్తిన అనుమానాల నివృత్తిపై పోలీసులు దృష్టి పెట్టారు.

మరిన్ని వార్తలు