పాండి మరణం కేసులో మలుపు

18 Dec, 2017 03:11 IST|Sakshi

మరో ఇన్‌స్పెక్టర్‌ గురి తప్పడంతోనే మృతి.. 

రాజస్తాన్‌ పోలీసుల నిర్ధారణ

సాక్షి, చెన్నై: తమిళ ఇన్‌స్పెక్టర్‌ పెరియ పాండి మరణం కేసు మలుపు తిరిగింది. ఆయనను దుండగులు కాల్చి చంపేశారంటూ తమిళ పోలీసుల బృందం రచించిన నాటకాన్ని రాజస్తాన్‌ రాష్ట్రం పాలి జిల్లా పోలీసులు బట్టబయలు చేశారు. చెన్నై కొళత్తూరులోని ఓ నగల దుకాణం దోపిడీ కేసు ఛేదింపునకు రాజస్తాన్‌కు వెళ్లిన పోలీసుల బృందంపై దుండగులు కాల్పలు జరపడం, ఇందులో మదుర వాయిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పెరియపాండి మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఇది కట్టు కథగా పాలి పోలీసులు తేల్చారు.

దుండగుడ్ని పట్టుకునే క్రమంలో మరో ఇన్‌స్పెక్టర్‌ మునిశేఖర్‌ తుపాకీ గురి తప్పడంతోనే పెరియపాండి మరణించినట్టు నిర్ధారించారు. తన తుపాకీ తీసుకుని దుండగుడు నాదూ రాం.. ఇన్‌స్పెక్టర్‌ పెరియ పాండిని కాల్చాడని మునిశేఖర్‌ పేర్కొనడంతో అనుమానమొచ్చిన పాలీ పోలీసులు విచారణ చేపట్టారు. తుపాకీని కాల్చింది మునిశేఖరే అని విచా రణలో తేలినట్లు పాలీ ఎస్పీ దీపక్‌ భార్గవ్‌ తెలిపారు. అజాగ్రత్తగా వ్యవహరించిన అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ నెల 12న నాదూరాంను పట్టుకున్నప్పుడు పెరియపాండిపై దుండగుడి బంధువులు దాడి చేయగా, అతడిని రక్షించే క్రమంలో మునిశేఖర్‌ నాదూరాంకి గురిపెట్టి కాల్చిన తూటా గురి తప్పి పెరియపాండిని బలిగొనట్లు తేల్చారు. 

మరిన్ని వార్తలు