తరలిపోతున్న తాబేళ్లు

17 Feb, 2019 13:13 IST|Sakshi
కైకలూరు ఆటపాక పక్షుల విహార కేంద్రం వద్ద పట్టుకున్న తాబేళ్ల వ్యాన్‌ వద్ద అటవీశాఖ రేంజర్‌ విజయ, సిబ్బంది (ఫైల్‌)

కొల్లేరులో యథేచ్ఛగా  అక్రమ రవాణా

ఒడిశా, కర్నాటక, అసోం రాష్ట్రాలకు తరలింపు

అంతరిస్తున్న తాబేళ్ల సంతతి అడ్డుకట్టవేయలేని అటవీశాఖ

ఎవరికీ ఏమాత్రం హాని తలపెట్టని సాధు జీవులు తాబేళ్లు. వేలాది ఏళ్ల చరిత్రకు ఇవి సాక్షిగా నిలుస్తాయి. అందుకేనేమో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. కొల్లేరు కేంద్రంగా తాబేళ్ల స్మగ్లింగ్‌ య«థేచ్ఛగా సాగుతోంది. ఒడిశా, అసోం, కర్ణాటక రాష్ట్రాలకు కొల్లేరు తాబేళ్లను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి కలిదిండి మండలం మద్వానిగూడెంలో 1,850 తాబేళ్లను అటవీశాఖాధికారులు పట్టుకున్నారు.

అమరావతి  ,కైకలూరు: కొల్లేరు కేంద్రంగా ముఠా సభ్యులు తాబేళ్లను గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో తరలించేస్తున్నారు. ఈ ప్రాంతంలో చేపల చెరువుల పట్టుబడి సమయంలో చెరువు అడుగున వందల సంఖ్యలో తాబేళ్లు లభ్యమవుతున్నాయి. అక్రమార్కులు చేపల వలల మేస్త్రీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఇవేకాకుండా డ్రెయిన్లు, గోతుల్లో లభ్యమయ్యే తాబేళ్లను ఆయా గ్రామాల్లో ఓ పెద్ద పీపాలో నిల్వ చేస్తున్నారు. వారంలో ఒక రోజు వ్యాన్‌లో అన్నింటినీ సేకరించి రాష్ట్రం దాటించేస్తున్నారు. చేపల ట్రేలలో పైన చేపలు, కింద తాబేళ్లను ఉంచి సరిహద్దులు దాటించేస్తున్నారు. 

తాబేలు మాంసానికి డిమాండ్‌
అస్సాం, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో తాబేలు మాంసానికి మంచి డిమాండ్‌ ఉంది. కొన్ని ఔషధాల్లో ఈ మాంసాన్ని ఉపయోగిస్తారు. కొల్లేరు ప్రాంతంలో కేజీ తాబేలును రూ.300కు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో కేజీ రూ.750కి విక్రయిస్తున్నారు. తాబేళ్లు పొదిగే కాలంలో అక్రమ రవాణాకు గురవడంతో వాటి సంతతి అంతరించిపోతోంది. ఈ ప్రాంతంలో 2014 డిసెంబరు 7న కలిదిండి మండలం వెంకటాపురం వద్ద 13 బస్తాల్లో 700 తాబేళ్లను అప్పటి రేంజర్‌ సునీల్‌కుమార్‌ పట్టుకున్నారు. ముదినేపల్లిలో భారీ తాబేళ్ల లోడును గతంలో స్వాధీనం చేసుకున్నారు. కైకలూరు శివారు ఏలూరు రోడ్డు వద్ద తాబేళ్ల మూటలతో ఒకరిని అరెస్టు చేశారు. తాజాగా మద్వానిగూడెం వద్ద ఘటన వెలుగుచూసింది. అటవీ అధికారులు సరైన నిఘాను పెట్టకపోవడంతో తాబేళ్లు సరిహద్దులు దాటుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. 

చట్టం ఏమి చెబుతుందంటే..
అంతరించిపోతున్న తాబేలు జాతిని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు షెడ్యూలు –1 కేటగిరీలో చేర్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేళ్లను వేటాడితే 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించే అవకాశం ఉంది. కొల్లేరు ప్రాంతం మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా తాబేళ్లను పట్టుకుని నిల్వ చేస్తే అటవీ అధికారులకు సమాచారం అందిస్తే దాడులు చేసి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

సెల్‌లో కాల్‌డేటా కీలకం..
కలిదిండి మండలం మద్వానిగూడెం వద్ద శుక్రవారం అర్ధరాత్రి పట్టుబడిన పశ్చిమబెంగాల్‌కు చెందిన హరమ్‌ఘోష్, దివాసిస్‌దాసుల సెల్‌ఫోన్లలో అక్రమ తాబేళ్ల ముఠాకు చెందిన స్థానిక నాయకుల సెల్‌ నెంబర్లను కనుగొన్నారు. పోలీసులు ఆ సెల్‌ నెంబర్లను విచారణ చేస్తే ఖచ్చితంగా కొల్లేరు ప్రాంతంలో ముఠా సభ్యుల గుట్టురట్టవుతుంది. ఇప్పటికైనా అటవీశాఖాధికారులు పూర్తి స్థాయి విచారణ చేయించి నిందితులను అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నారు.

నిఘాను ముమ్మరం చేస్తాం
కొల్లేరు పరిసర ప్రాంతాల్లో తాబేళ్ల అక్రమ రవాణాపై నిఘాను ముమ్మరం చేస్తాం. పెద్ద పులి మాదిరిగా షెడ్యూల్‌ –1 జాబితాలో తాబేలు ఉంది. ఇది అంతరించే జాతుల జాబితాలోకి చేరుతోంది. చేపల చెరువుల పట్టుబడి సమయంలో సిబ్బందితో నిఘా నిర్వహిస్తాం. తాబేళ్లను  వేటాడం చట్టరీత్యా నేరం. 7 సంవత్సరాలు కఠినకారాగార శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తారు.– బి.విజయ, ఫారెస్టు రేంజర్, కైకలూరు  

మరిన్ని వార్తలు