35 మందికి ఐదేళ్ల శిక్ష నుంచి విముక్తి

29 Nov, 2017 04:08 IST|Sakshi
సీమేన్‌ గార్డు ఒకియా అమెరికా నౌక (ఫైల్‌ ఫొటో)

తూత్తుకూడిలో అక్రమ ఆయుధాల నౌక కేసులో కోర్టు తీర్పు

సాక్షి ప్రతినిధి, చెన్నై: హద్దుమీరి భారత సముద్రతీరంలోకి ప్రవేశించిన నేరంపై ఐదేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న 35 మందికి విముక్తి లభించింది. అమెరికా ఆయుధ నౌక కెప్టెన్‌ సహా 35 మందికి పడిన శిక్షను మదురై హైకోర్టు శాఖ సోమవారం కొట్టివేసింది.

తూత్తుకూడికి తూర్పున భారత సముద్రతీరంలో అత్యాయు ధమైన ఆయుధాలతో కూడిన ‘సీమేన్‌ గార్డు ఒకియా’ అనే పేరుగల అమెరికా నౌక 2013 అక్టోబరు 11న భారత కోస్ట్‌గార్డుకు పట్టుబడింది. ఈ నౌకలో కెప్టెన్‌ టుట్నిక్‌ వాలంటైన్‌తోపాటు 12 మంది భారతీయులు, ఉక్రెయిన్, ఇంగ్లాండ్, ఎస్టోనియా తదితర దేశాలకు చెందిన 23 మంది సహా మొత్తం 35 మంది ఉన్నారు. వీరందరినీ అరెస్ట్‌ చేశారు. ఈ నౌకలో జీపీఎస్‌లు, 35 అత్యాధునికమైన తుపాకీలు, 5,680 తూటాలను కనుగొన్నారు.

2013 డిసెంబర్‌ 30న చార్జిషీటు దాఖలు చేయగా 2015 ఆగస్టు 12న తూత్తుకూడి ఫస్ట్‌క్లాస్‌ కోర్టు మేజిస్ట్రేటు రాజశేఖర్‌ విచారణ ప్రారంభించారు. 2016 జనవరి 11న వీరికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తూత్తుకూడి న్యాయస్థానం ప్రకటించింది. నిందితులు మధురై హైకోర్టులో శిక్షపై సవాలు చేశారు. ఉద్దేశపూర్వకంగా సరిహద్దులు దాటలేదన్న నిందితుల తరఫు న్యాయవాదుల  వాదనతో ఏకీభవించిన కోర్టు... తూత్తుకూడి ఇచ్చిన తీర్పును శిక్షను రద్దు చేసింది.

మరిన్ని వార్తలు