నాడు మిస్సైనా.. నేడు బుక్కయ్యాడు!

13 Nov, 2018 08:59 IST|Sakshi
రామచంద్రబాబు

సినీ నటుడు రామచంద్రబాబు అరెస్టు

వేరొకరి స్థలంపై బోగస్‌ పత్రాల సృష్టి

భాగస్వామ్యమంటూ రూ.60 లక్షలు స్వాహా

టీవీ సీరియళ్ల పేరుతో మరో రూ.50 లక్షలు

అప్పట్లో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్‌

గడువు ముగియడంతో అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: అతని పేరు ఏ.రామచంద్రబాబు... వృత్తి సినిమాలు, టీవీల్లో నటించడం... ఇతడిపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు పదేళ్ల క్రితం కేసు నమోదు చేశారు... అప్పట్లో ముందస్తు బెయిల్‌ పొందిన బాబు అరెస్టు నుంచి తప్పించుకున్నాడు... ఆపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి దీన్ని పొడిగించుకోవాల్సి ఉండగా అలా జరగలేదు... దీంతో రామచంద్రబాబును సోమవారం అరెస్టు చేసిన సీసీఎస్‌ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అతడికి కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదలయ్యాడు. ప్రధానంగా బుల్లితెర నటుడిగా ఉన్న ఏ.రామచంద్రబాబు ‘చక్రవాకం’, ‘రుతురాగాలు’ వంటి సీరియళ్లలో నటించారు. అనేక చిత్రాల్లో కథానాయకుడి తండ్రి పాత్రలతో పాటు మరికొన్ని కీలక రోల్స్‌ పోషించాడు. బంజారాహిల్స్‌లోని సర్వే నెం. 129/35లో ఖాదర్‌ భాషాతో పాటు మరి కొందరికి 3 ఎకరాలు, 21 గుంటల స్థలం ఉంది. వీరికి రూ.20 లక్షలు ఇస్తానంటూ రంగంలోకి దిగిన రామచంద్రబాబు కొన్ని పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నాడు.

వీటిని వినియోగించి ఆ స్థలం తన పేరుతోనే ఉందని, అయితే కొన్ని విభేదాలు ఉన్నాయంటూ సంతోష్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌ను సంప్రదించాడు. తనకు రూ. 60 లక్షలు ఇస్తే ప్రతిఫలంగా స్థలంలో 25 శాతం వాటా ఇస్తానంటూ నమ్మబలికాడు. ఈ తతంగంలో కర్నూలు జిల్లా పాణ్యంకు చెందిన ఓ రాజకీయ నాయకుడు మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు టీవీ సీరియళ్లు తీస్తానంటూ మళ్లీ శ్రీనివాస్‌ వద్దకు వెళ్లిన రామచంద్రబాబు మరో రూ.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. తన డబ్బు తిరిగిరాక పోవడం, స్థలంలో వాటా సైతం ఇవ్వకపోవడంతో శ్రీనివాస్‌ అతడిపై ఒత్తిడి పెంచాడు. దీంతో ఆ మొత్తానికి పది పోస్ట్‌డేటెడ్‌ చెక్కులు ఇచ్చాడు. ఇలా ఇచ్చినట్టే ఇచ్చిన రామచంద్రబాబు మరోపక్క తన చెక్కులు పోయాయని, వాటిని ఎవరైనా దుర్వినియోగం చేసి తనపై చెక్‌బౌన్స్‌ కేసులు పెట్టే అవకాశం ఉందంటూ  డబీర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశా డు.

దీంతో కంగుతిన్న శ్రీనివాస్‌ తనకు వాటా ఇచ్చిన స్థలం విషయంపై ఖాదర్‌ భాషాను సంప్రదించగా తాను స్థలాన్ని ఎవరికీ అమ్మలేదని చెప్పా డు. దీంతో శ్రీనివాస్‌ పాణ్యంకు చెందిన రాజకీయ నాయకుడిని సంప్రదించినా స్పందన లేకపోవడం తో సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2009లో కేసు నమోదు చేసుకున్న అధికారులు రామచంద్రబాబు కోసం వేట ముమ్మరం చేశారు. దీనిని గుర్తిం చిన బాబు హైకోర్టు ద్వారా ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నాడు తాజాగా గత నెల్లో ముందస్తు బెయిల్‌ గడువు ముగిసింది. దీన్ని కోర్టు ద్వారా పొడిగించుకోవాల్సి ఉండగా అలా చేసుకోలేదు. దీంతో అధికారులు సోమవారం రామచంద్రబాబు ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో హాజరైన న్యాయవాది ఇది సాంకేతిక తప్పిదమంటూ కోర్టుకు నివేదించడంతో న్యాయస్థానం మరోసారి అతడికి   బెయిల్‌ మంజూరుచేసింది.

మరిన్ని వార్తలు