రవిప్రకాశ్‌ పాస్‌పోర్ట్‌ స్వాధీనం, శివాజీ ఇంట్లో సోదాలు

9 May, 2019 13:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫోర‍్జరీతో పాటు, నిధుల మళ్లింపుకు పాల్పడి టీవీ9 నుంచి ఉద్వాసనకు గురైన రవిప్రకాశ్‌ పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గత రెండురోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీవీ చానల్ నిర్వహణ తన ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో కొత్త యాజమాన్యానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, చివరికి ఓ కీలక ఉద్యోగి సంతకాన్ని కూడా ఫోర్జరీ రవిప్రకాశ్‌ను ఆ సంస్థ సీఈవో పదవి నుంచి టీవీ9 యాజమాన్యం తొలగించింది. అలంద మీడియా సంస్థ ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై సైబర్‌ క్రైమ్‌లో 406, 467, ఐటీ యాక్ట్‌ 56 సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

చదవండి: టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదు

నటుడు శివాజీ నివాసంలో సోదాలు..
అలాగే టీవీ9లో తనకు వాటా ఉందంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన నటుడు శివాజీ నివాసంలోనూ పోలీసులు సోదాలు జరుపుతున్నారు. నారాయణగూడ, హిమాయత్‌ నగర్‌లోని ఆయన నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా సంస్థకు హాని కలిగించే దురుద్దేశంతో శివాజీతో దురుద్దేశ పూర్వకంగా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా, సంస్థ యాజమాన్యానికి... కంపెనీ నిర్వాహణలో ఇబ్బందులు కల్పించేలా రవి ప్రకాశ్ ప్రయత్నిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన విషయం తెలిసిందే. ఈ కుట్రలో భాగంగా కంపెనీకి చెందిన ముఖ్యమైన డాటాను తస్కరించడమే కాక, కంపెనీకి నష్టం చేసే దురుద్దేశంతో ఆ డేటాను బయటి వ్యక్తులకు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయని కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది.

అలందా మీడియా ఫిర్యాదు ప్రకారం రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీతో కలిసి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడి ఏబీసీఎల్‌ యాజమాన్యానికి, కంపెనీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే, సినీనటుడు శివాజీ ఏప్రిల్ 19, 2019న హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్టీ)ని ఆశ్రయించారు. శివాజీ దాఖలు చేసిన అఫిడవిట్‌ ప్రకారం...  ఏబీసీఎల్‌లో రవిప్రకాశ్‌కు 20 లక్షల షేర్లు అంటే 8 శాతం వాటా ఉంది. ఇందులోనుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు రవి ప్రకాశ్‌కు 20 లక్షల రూపాయలు చెల్లించి ఫిబ్రవరి 20, 2018న  ఒప్పందం కుదుర్చుకున్నానని, ఈ ఒప్పందం జరిగిన ఏడాదిలోగా షేర్లను తన పేరు మీద బదిలీ చేసేందుకు రవిప్రకాశ్ అంగీకరించారని, తాను అతని మీద నమ్మకం ఉంచానని శివాజీ పేర్కొన్నారు.

చదవండిటీవీ9 నుంచి రవిప్రకాశ్‌కు ఉద్వాసన 

అయితే, ఏబీసీఎల్‌లో మార్పులకు సంబంధించి రవిప్రకాశ్ కొన్ని నిజాలను తనవద్ద దాచారని, మోసపూరితంగా వ్యవహరించారని శివాజీ ఆరోపించారు. షేర్ల బదిలీ గురించి తాను పలుమార్లు రవిప్రకాశ్‌కు గుర్తు చేసినా ఏదో ఒక సాకు చూపుతూ, షేర్లు బదిలీ చేయలేదని, దీంతో తాను విసిగిపోయి ఫిబ్రవరి 15, 2019న రవిప్రకాశ్‌కు స్వయంగా నోటీసు అందజేశానని శివాజీ ఎన్‌సీఎల్టీ వద్ద దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దానికి రవి ప్రకాశ్‌ ఫిబ్రవరి 17న స్పందిస్తూ షేర్ల బదిలీలో జాప్యానికి ఎన్‌సీఎల్టీ జారీ చేసిన ఒక మధ్యంతర ఉత్తర్వు కారణమని, ఈ వివాదం పరిష్కారం అయిన తర్వాత షేర్లు బదిలీ చేస్తానని సమాధానం ఇచ్చారు. 

రవిప్రకాశ్, శివాజీల మధ్య 2018 ఫిబ్రవరిలో జరిగినట్లుగా చెబుతున్న షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కేవలం తెల్ల కాగితాలపై ఉండడం గమనార్హం. ఎవరైనా వాటా కొనుగోలు చేస్తే తక్షణం షేర్ల బదిలీ కోరుకుంటారు, కానీ, శివాజీ ఇందుకు ఏడాది గడువు ఇచ్చాననడం అనుమానాలను కలిగిస్తోంది. ఈ అనుమానాల వల్లే, శివాజీ, రవిప్రకాశ్ మధ్య కుదిరనట్లు చెబుతున్నది ఫోర్జరీ ఒప్పందంగా టీవీ9 కొత్త యాజమాన్యం భావిస్తోంది. కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో రవిప్రకాశ్, శివాజీతో కలిసి కుమ్మక్కై ఈ నాటకానికి తెర తీశారని ఏబీసీఎల్‌ కొత్త యాజమాన్యం తన ఫిర్యాదులో పేర్కొంది. 

మరిన్ని వార్తలు