బుకాయింపు.. సమర్థింపు!

9 Jun, 2019 07:52 IST|Sakshi
విచారణకు హాజరైన టీవీ–9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌...

విచారణలో మారని రవిప్రకాశ్‌ తీరు

తాను చేసింది కరెక్టేనని జవాబులు కొన్ని ప్రశ్నలకు సమాధానాల దాటవేత

టీవీ9 లోగో విక్రయంలో విచారణ పూర్తి అవసరమైతే మరోసారి

విచారిస్తామన్న ఏసీపీ న్యాయసలహా అందకపోవడంతో అరెస్టులో జాప్యం

సాక్షి, హైదరాబాద్‌: టీవీ9 లోగో విక్రయం కేసులో బంజారాహిల్స్‌ పోలీసుల విచారణ పూర్తయింది. రెండోరోజు విచారణకు హాజరైన ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ తీరు ఏమాత్రం మారలేదని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా బుకాయించడం, చేసిన పనిని సమర్థించుకోవడం, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడం వంటి పాత ధోరణే ప్రదర్శించినట్టు తెలిసింది. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌ మార్కులను మీడియా నెక్ట్స్‌ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం రెండోరోజు శనివారం ఉదయం 11.00 గంటలకు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ చేరుకున్న రవిప్రకాశ్‌ను పోలీసులు ఆరు గంటలపాటు విచారించారు.

ముందుగానే సిద్ధం చేసుకున్న 48 ప్రశ్నలను ఆయనపైకి సంధించారు. మోజో టీవీకి టీవీ9 లోగోను ఎందుకు విక్రయించారన్న ప్రశ్నకు.. తాను అంతా చట్ట ప్రకారమే చేశానని, తనకు అన్ని హక్కులూ ఉన్నందునే లోగోను విక్రయించానని రవిప్రకాశ్‌ సమర్థించుకున్నట్లు తెలిసింది. దాదాపు అన్ని ప్రశ్నలకూ సమర్థించుకునే ధోరణిలో.. తానే కరెక్టు అంటూ చెప్పినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలకు వెటకారపు ధోరణిలో సమాధానాలిచ్చినట్టు తెలిసింది. పోలీసులు విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయడం విశేషం. శుక్రవారం పోలీసుల ఆదేశాల మేరకు టీవీ9 లోగోను విక్రయించిన పత్రాలను రవిప్రకాశ్‌ సమర్పించగా.. విశ్వసనీయతను నిర్ధారించుకునేందుకు పోలీసులు ఆ పత్రాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నట్లు సమాచారం.
 
అవసరమనుకుంటే మరోసారి పిలుస్తాం.. 
రెండు రోజుల విచారణలో రవిప్రకాశ్‌ చెప్పిన సమాధానాలను నిజమో కాదో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఏసీపీ రావు మీడియాకు తెలిపారు. వాటి ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకవేళ ఆయన చెప్పిన విషయాలు వాస్తవాలు కాదని తేలితే, తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అవసరమనుకుంటే మరోసారి రవిప్రకాశ్‌ను విచారణకు పిలిపిస్తామని చెప్పారు.

రవిప్రకాశ్‌పై నిఘా...
రవిప్రకాశ్‌ తిరిగి పరారయ్యే అవకాశాలు ఉండటంతో సైబరాబాద్‌కు చెందిన ఓ షాడో టీం ఆయన్ను నిత్యం నీడలా వెంటాడుతోంది. శుక్రవారం బంజారాహిల్స్‌లో విచారణ పూర్తయిన అనంతరం రవిప్రకాశ్‌ ఖైరతాబాద్‌లోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌కు మరో వ్యక్తితో కలిసి వెళ్లాడు. అక్కడ ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. ఆయన్నూ ఎవరూ పలకరించలేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు స్పష్టమైన సమాచారం చేరుతోంది. కాగా, రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. న్యాయనిపుణల నుంచి న్యాయ సలహా ఇంకా అందకపోవడంతో అరెస్టులో జాప్యం జరుగుతోంది. న్యాయ సలహా రాగానే దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. 

మరిన్ని వార్తలు