రవిప్రకాశ్‌పై మరో కేసు 

17 May, 2019 01:08 IST|Sakshi

తప్పుడు పత్రాలతో మీడియా నెక్ట్స్‌ ఇండియా కంపెనీకి బదలాయింపు 

రవిప్రకాశ్, ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిషన్‌ చెరెడ్డిలపై కేసులు నమోదు 

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదైంది. టీవీ9 కాపీ రైట్స్, ట్రేడ్‌మార్క్‌లను కేవలం రూ.99వేలకే ‘మీడియా నెక్ట్స్‌ ఇండియా’ కంపెనీకి బదలాయించినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్డ్‌ డీడీలు అమలుచేశారంటూ అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఏబీసీఎల్‌) డైరెక్టర్‌ పి.కౌశిక్‌రావు బంజారాహిల్స్‌ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు వ్యక్తులు టీవీ9 మాజీ సీఎఫ్‌వో ఎంవీకేఎన్‌ మూర్తి, రవిప్రకాశ్‌ అనుచరుడు మీడియా నెక్ట్స్‌ కంపెనీకి చెందిన హరికిషన్‌ చెరెడ్డిల పాత్ర కూడా ఉందని పేర్కొనడంతో ఐపీసీ 467, 420, 409, 406, 120(బీ) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే టీవీ9లో మెజారిటీ వాటా (90.54%)ను ఏబీసీఎల్‌ నుంచి అలందా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. 2018 ఆగస్టు 27న దక్కించుకున్నప్పటి నుంచి తమ పట్టుకోల్పోతున్నామని భావించిన రవిప్రకాశ్‌ అడ్డదారులు తొక్కాడని కౌశిక్‌రావు ఫిర్యాదులో పేర్కొన్నారు.

శివాజీకి షేర్లు విక్రయ ఒప్పందంపై నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్, హైదరాబాద్‌ బెంచ్‌లో ఉండగా, తప్పుడు పత్రాలతో పాటు సంతకం ఫోర్జరీపై సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దర్యాప్తు క్రమంలో రవిప్రకాశ్, మూర్తితో పాటు ఈ గూడుపుఠాణిలో హరికిషన్‌ పాత్ర కూడా ఉందంటూ తమ దృష్టికి వచ్చిందని కౌశిక్‌రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018 మే 5న టీవీ9 కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌లు మీడియా నెక్ట్స్‌ ఇండియా కంపెనీకి బదలాయింపుపై మౌఖిక చర్చలు జరిగాయని అయితే 2018 డిసెంబర్‌ 31న అసైన్డ్‌ డీడీలు అమలుచేసినట్టుగా చూపించారన్నారు. అయితే రికార్డులను తనిఖీ చేస్తే 2019 జనవరి 11వ తేదీన రూ.99వేలు చెల్లించినట్టుగా ఉందని, బుక్స్‌లో మాత్రం 2019 ఫిబ్రవరి 28వ తేదీగా ఉందన్నారు. టీవీ9 కాపీరైట్స్, ట్రేడ్‌మార్క్‌ల బదలాయింపుతో కంపెనీకి నష్టం చేకూరేలా తప్పుడు పత్రాలు సృష్టించారని కౌశిక్‌రావు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు