ఒక్కో టీవీఎస్‌కు.. ఒక్కో సంవత్సరం జైలు శిక్ష

23 Aug, 2019 08:19 IST|Sakshi

సాక్షి, ప్రత్తిపాడు(గుంటూరు) : అతనో ఘరానా దొంగ. చూడటానికి దివ్యాంగుడే అయినప్పటికీ అతని కన్ను పడితే మాత్రం టీవీఎస్‌ మాయమే. అలాంటి మాయల మరాఠీని ప్రత్తిపాడు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఒక్కో కేసుకు ఒక్కో ఏడాది చొప్పున ఎనిమిది కేసులకు ఎనిమిది సంవత్సరాల పాటు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రత్తిపాడు మండల పరిధిలోని పలు గ్రామాల్లో టీవీఎస్‌లు వరుస చోరీలకు గురవుతూ వస్తున్నాయి. దీంతో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్న అప్పటి ఎస్‌ఐ ఏ.బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా పెదకూరపాడు మండలం గారపాడుకు చెందిన సంగేపు అర్జునరావు (40)ను పట్టుకున్నారు.

అతని నుంచి సుమారు ఇరవైవరకు టీవీఎస్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ముద్దాయిపై 379 ఐపీసీ సెక్షన్‌ కింద 76/19, 81/19, 82/19, 83/19, 84/19, 85/19, 87/19, 89/19 మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. వాటిలో ఈనెల 20వ తేదీన రెండు కేసుల్లో, 21వ తేదీన 3 కేసుల్లో, 22న 3 కేసుల్లో శిక్షలు విధిస్తూ ఆరవ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.అరుణ తీర్పు ఇచ్చారు. ఒక్కో కేసుకు ఒక్కో ఏడాది చొప్పున ఎనిమిది కేసుల్లో ఎనిమిది సంవత్సరాలు శిక్షలు విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ప్రత్తిపాడు ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు