భయోత్పాతం.. భీతావహం

24 Sep, 2018 02:35 IST|Sakshi

బలం చూపించేందుకే జంట హత్యలు

రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారమేనా.?

అదను చూసి దెబ్బకొట్టిన మావోలు

మన్యంపై పట్టుకోల్పోలేదని సంకేతాలు

లివిటిపుట్టు నుంచి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మన్యం ఉలిక్కిపడింది. మావోయిస్టుల ఘాతుకంతో ఏవోబీ భీతిల్లింది. రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా, మన్యంలో తమ ప్రాబల్యం ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకు మావోయిస్టులు తెగబడ్డారు. అందరూ చూస్తుండగానే ఓ ప్రజాప్రతినిధితో పాటు, మాజీ ప్రజాప్రతినిధిని కాల్చి చంపిన ఘటన ఏజెన్సీలో కలకలం రేపుతోంది. మావోయిస్టులకు విశాఖ మన్యం పెట్టనికోట. ఖాకీ చొక్కా అటువైపు తొంగి చూడలేదనే మాటలు వినిపించేవి. అయితే రామ్‌గుడ పరిసరాల్లో 2016 అక్టోబర్‌ 24న మావోయిస్టులపై ఒక్కసారిగా విరుచుకుపడిన పోలీసులు 30 మంది నక్సల్స్‌ను హతమార్చారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు కీలక నేతలు సైతం ప్రాణాలు కోల్పోవడంతో.. ఏవోబీపై పూర్తి ఆధిపత్యం సాధించామని పోలీసులు భావించారు.

దేశచరిత్రలోనే అతిపెద్ద ఎన్‌కౌంటర్‌గా పేర్కొనే.. పోలీసుల ఏకపక్ష యుద్ధంలో కీలక నేతలు నేలకొరగడం మావోలకు మింగుడు పడలేదు. ప్రతీకారంతో రగిలిపోయారు. అదనుకోసం ఎదురుచూశారు. ఏజెన్సీలో అడపాదడపా ఉనికి చాటుతూనే వచ్చారు. ఒకవైపు గ్రేహౌండ్స్‌ దళాలు, పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేసినా.. పలు హింసాత్మక చర్యలకు పాల్పడడమేగాక వారోత్సవాలు జరపడం, పోస్టర్లు వేయడం వంటి చర్యల ద్వారా వారు తమ ఉనికి చాటుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా కేబినెట్‌ హోదా ఉన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుతోపాటు అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కాల్చి చంపి భయోత్పాతాన్ని సృష్టించారు. మన్యంపై తమ పట్టు కోల్పోలేదని చాటడంతోపాటు భయం పుట్టించేందుకే ఎమ్మెల్యే, మాజీ ప్రజాప్రతినిధిపై విరుచుకుపడి హతమార్చినట్టు తెలుస్తోంది. రామ్‌గుడ ఎన్‌కౌంటర్‌ సమయంలో 11 మంది మహిళా మావోయిస్టులు మరణించారు. ఈ కారణంగానే ఈ జంట హత్యల వ్యవహారంలో సింహభాగం మహిళా యాక్షన్‌ టీమ్‌ సభ్యులే పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 

మన్యంలో భయంభయం
ఓ ఎమ్మెల్యేను చంపడం మన్యంలో ఇదే తొలిసారి కావడంతో ఏజెన్సీ ప్రాంతంలో భయోత్పాతం నెలకొంది. తమ బలం నిరూపించేందుకు మావోయిస్టులు తెగబడిన ఈ ఘటన మన్యంలో కలకలం రేపింది. ఈ ఘటనతో గిరిసీమలు వణికిపోతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలతో గ్రామస్తులు బితుకుబితుకుమంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చిన దరిమిలా ఏజెన్సీలోని గిరి గ్రామాల్లో పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో.. ఎప్పుడెలా ఉంటుందోననే భయంతో మారుమూల గూడేల్లోని ప్రజలు హడలిపోతున్నారు. ఆదివాసీలు ఇళ్లు వదిలి బయటకు రావట్లేదు. పొలం పనులకు వెళ్లేందుకూ జంకుతున్నారు. డుంబ్రిగుడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. మరికొన్ని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.

2014లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలపై మావోయిస్టులు ప్రధానంగా దృష్టి సారించారు. సుకుమా జిల్లాలో జరిపిన దాడిలో 15 మంది భద్రతా సిబ్బంది, ఒక పౌరుడు చనిపోయారు. మహారాష్ట్ర గడ్చిరోలిలో నక్సలైట్లు పేల్చిన మందుపాతరలో ఏడుగురు పోలీసులు చనిపోయారు. 
మొత్తం సంఘటనలు – 155
చనిపోయిన పౌరులు – 128
మరణించిన భద్రతాసిబ్బంది – 87

2015లో ఛత్తీస్‌గఢ్‌ మందు పాతరలు, ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లింది. 
మొత్తం సంఘటనలు – 118
చనిపోయిన పౌరులు – 93
చనిపోయిన భద్రతాసిబ్బంది – 57

2016లో ఛత్తీస్‌గఢ్‌లో దాడులు జరిగినప్పటికీ గతంతో పోలిస్తే తక్కువ ఘటనలు జరిగాయి.
మొత్తం సంఘటనలు – 69
మొత్తం చనిపోయిన పౌరులు – 123
మొత్తం చనిపోయిన భద్రతాసిబ్బంది – 66

మరిన్ని వార్తలు