ఒకే నంబర్‌తో రెండు బైక్‌లు

6 Jun, 2018 13:36 IST|Sakshi
నీలోఫర్‌ ఆసుపత్రి ఎదుట నోపార్కింగ్‌లో నిలిపిన వాహనం, చల్వాయిలో మోహన్‌కు చెందిన టీఎస్‌ 25 0468 నెంబర్‌ పల్సర్‌ వాహనం

ఒకటి చల్వాయిలో, మరొకటి హైదరాబాద్‌లో..

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు

గోవిందరావుపేట : ఒకే నంబర్‌తో పల్సర్‌ టూవీలర్‌ బండ్లు రెండు కనిపించడం కలకలం రేపుతోంది.  వివరాల్లోకి వెళితే చల్వాయికి చెందిన సాయబోయిన భిక్షపతి, మోహన్‌ అన్నదమ్ములు. భిక్షపతి హన్మకొండలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన వద్దే ఉంటున్న తమ్ముడికి బైక్‌ కొని ఇచ్చాడు. మోహన్‌ భూపాలపల్లిలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా అతనికి టీఎస్‌ 25 0468 నెంబర్‌ను కేటాయించారు.  

ఈ క్రమంలో అదే నెంబర్‌పై హైదరాబాద్‌లో ఓ బ్లాక్‌పల్సర్‌ బండిపై మరో వ్యక్తి తిరుగుతున్నాడు. గత 20 రోజుల వ్యవధిలో మూడుసార్లు బండి విషయంలో తప్పులు దొర్లడంతో సీసీ కెమెరాల ఫుటేజీల ఆదారంగా అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు విధిస్తూ  ఆ నెంబర్‌పై రిజిస్ట్రేషన్‌లో ఉన్న మోహన్‌ సెల్‌ నెంబర్‌కు మెసేజ్‌లు పంపారు. దీంతో అన్నయ్య భిక్షపతికి తెలుపగా ఆన్‌లైన్‌లో చూశారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో హెల్మెట్‌ లేకుండా, నీలోఫర్‌ ఆస్పత్రి ఎదుట రెండు రోజుల పాటు నో పార్కింగ్‌ జోన్‌లో వాహనం నిలిపినందుకు రెండు సార్లు జరిమానాలు విధిస్తున్నట్లు కనిపించింది. దీంతో అవాక్కయిన మోహన్‌ జరిగిన విషయాలను పస్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  


 

మరిన్ని వార్తలు