బడికి పోయినా బతికెటోళ్లు

9 Feb, 2020 12:06 IST|Sakshi
చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న మృతుల కుటుంబసభ్యులు

సాక్షి, బచ్చన్నపేట : బడికి వెళ్లి ఉంటే ఆ ఇద్దరు బాలురు బతికి ఉండేవారు.. ఒకే పాఠశాలలో చదువుతున్న రెండో తరగతి బాలురు ఆడుకోవడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగిన సంఘటన జనగామ జిల్లా మండలం పోచన్నపేట గ్రామంలో చోటుసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. పోచన్నపేటకు చెందిన బేడ బుడిగ జంగాల కాలనీకి చెందిన నూనె ఎల్లమ్మ–మదార్‌ పెద్దకుమారుడు జక్కరయ్య(7)తో పాటు అదే కాలనీకి చెందిన కడకంచి లక్ష్మీ–సారయ్య దంపతుల పెద్ద కుమారుడు పాలయ్య(7) స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు. శనివారం పాఠశాలకు వెళ్లకుండా కాలనీ పక్కనే ఉన్న చెరువు వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. చెరువులో మిషన్‌భగీరథ పనుల్లో భాగంగా జేసీబీతో పెద్ద గుంతలను తీశారు.

సమీపంలో ఆడుకుంటున్న పిల్లలిద్దరూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. నీట మునుగుతున్న క్రమంలో పిల్లలను కేకలు వేయడంతో సిద్ధులు అనే స్థానిక వ్యక్తి గమనించి అక్కడకి చేరుకుని పిల్లలను బయటకు తీసేసరికే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా.. మృతి చెందిన బాలుడు పాలయ్య తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ గువ్వల ఎల్లమ్మ పోషిస్తోంది.

‘అమ్మ నాయిన లేకపోయినా కంటికి రెప్పలా కాపాడుకుంటాన.. బడికి పోయి ఉంటే నా మనవడు బతికెటోడు’.. అంటై ఎల్లమ్మ గుండెలు పగిలేలా రోదిస్తున్న దీరు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. రెండో శనివారం పాఠశాలలకు సెలవు.. అయితే ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రకటించిన సెలవుల నేపథ్యంలో రెండో శనివారాలు ప్రభుత్వ పాఠశాలలకు పనిదినాలుగా సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు శనివారం స్కూల్‌ తెరిచే ఉంది. అయితే ఇద్దరు చిన్నారులు వెళ్లలేదు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా