కొడుకా..లేవరా..!

25 May, 2018 08:27 IST|Sakshi
చందును ఆస్పత్రికి తీసుకెళ్తున్న స్థానికులు.. చందు (ఫైల్‌) రిహాన్‌ (ఫైల్‌) 

మల్యాల(చొప్పదండి) : ‘ఉఠో భేటా..రంజాన్‌కా దిన్‌మే హమ్‌కో యే క్యా సదా భేటా..రియాన్‌ తేరే బినా కైసై జీనా రియాన్‌’.. ‘చందూ ఏమైందిరా..లేవురా.. ఇప్పుడే అత్తా అంటివి కదా బిడ్డా..నీతోని నేనత్త కొడుకా’.. అంటూ ఈతకు వెళ్లి మృతిచెందిన చిన్నారుల కుటుంబ సభ్యులు హృదయవిదారకంగా రోదించారు. మల్యాల మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన ఎండీ.రిహాన్‌(10) మూడో తరగతి పూర్తిచేశాడు. ముత్యంపేటకు చెందిన గంగాధర చందు(12) ఐదో తరగతి పూర్తిచేశాడు. బీసీ కాలనీలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. చందు బుధవారం రాత్రి ధర్మారంలోని తమ బంధువుల ఇంటి నుంచి వచ్చాడు. బీసీ కాలనీలోని రియాన్‌తోపాటు తన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. బావిలోకి ఈత కోసం దిగిన ఇద్దరు కొంతసేపటి వరకు పైకి రాకపోవడంతో మరో ఇద్దరు చిన్నారులు సమీపంలో రిహాన్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బావిలో పైపు ఫూట్‌వాల్వ్‌కు కట్టిన తాడు చందు మెడకు చుట్టుకుందని, రిహాన్,చందు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మృతి చెందారని, మృతదేహాలను బావిలో నుంచి తీసిన ఒడ్డె నర్సింగ్‌ తెలిపారు.   

బతికున్నాడేమోనని.. 
చిన్నారుల కోసం సుమారు గంటపాటు గాలించారు. మొదట చందును బయటికి తీశారు. బతికి ఉన్నాడేమో అని అందుబాటులో ఉన్న అంబులెన్స్‌ వరకు ఎత్తుకెళ్లారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. అప్పటికే చందు మృతిచెందాడు.  మరో ఐదు నిమిషాలకు రిహాన్‌ మృతదేహంసైతం లభ్యమైంది. సీఐ నాగేంద్ర, ఎస్సై నీలం రవి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. 

మిన్నంటిన రోదనలు.. 
గంగాధర చందు తనతల్లి గర్భంలో ఉన్నప్పుడే తండ్రి అంజయ్య సౌదీ అరేబియాలో మృతిచెందాడు. నిన్నటి వరకు ధర్మారంలో చిన్నాన్న వద్దే ఉన్నాడు. గురువారం అమ్మా ఇప్పుడే వస్తా అని చెప్పి కానరాని లోకాలకు వెళ్లాడు. ఇద్దరు చిన్నారుల మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.  

మరిన్ని వార్తలు