విషాదం: పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి..

6 Sep, 2019 11:35 IST|Sakshi

విద్యుదాఘాతంతో ఇద్దరు కౌలు రైతుల దుర్మరణం 

మృతులు స్వయాన అన్నదమ్ములు 

సాక్షి, అనంతపురం : వారిద్దరూ అన్నదమ్ములు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ. సొంత భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని పంట సాగు చేశారు. పంట బాగా ఉన్న సమయంలో నీటి సమస్య వచ్చింది. నీటి సమస్య తీర్చుకునే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కుమారులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి ఆ తల్లి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. 

మండంలోని పొట్టిపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పంటకు మోటారు ద్వారా నీరు పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు కౌలు రైతులు దుర్మరణం పాలయ్యారు. మృతులిద్దరూ స్వయానా అన్నదమ్ములు కావడంతో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ఉరుకుందప్ప, భాగ్యమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉరుకుందప్ప ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. సొంత పొలం లేకపోవడం కుమారులు ముగ్గురూ  గ్రామానికి చెందిన రైతు వద్ద ఆరు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని మిర్చీపంట సాగు చేశారు. పంటకు సమీపంలోని హంద్రీ–నీవా కాలువ ద్వారా నీరు సరఫరా చేసేవారు. హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహం తగ్గడంతో పంటకు నీరందలేదు.

దీంతో శుక్రవారం ఉదయం పెద్దకుమారుడు సురేష్‌ పొలంలో ఉండగా మిగతా ఇద్దరు చంద్రన్న (25),వీరన్న (24) విద్యుత్‌మోటార్‌ను కాలువ కింద భాగంలో దించేందుకు వెళ్లారు. ఈక్రమంలో విద్యుదాఘాతానికి గురైన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లీడుకొచ్చిన యవకులు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్‌ఐ వెంకటస్వామి ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఘటనపై గ్రామస్తులతో ఫోన్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని రెవెన్యూ, విద్యుత్, వెలుగు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు