లాయర్‌ ఫీజు ఇచ్చేందుకు చోరీలు

3 Aug, 2019 15:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బనశంకరి (కర్ణాటక): జైలు నుంచి విడుదల కావడానికి జామీను ఇప్పించిన న్యాయవాదికి డబ్బు చెల్లించడానికి ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను శుక్రవారం కోరమంగల పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన సయ్యద్, వసీమ్‌ గతంలో అనేక ఇళ్లలో చోరీలకు పాల్పడటంతో పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. వీరిద్దరికి న్యాయవాది జామీను ఇప్పించి బయటకు తీసుకొచ్చారు.

న్యాయవాది ఫీజు చెల్లించడానికి జైలు నుంచి విడుదలైన అనంతరం సయ్యద్, వసీమ్‌ ఇద్దరూ మళ్లీ చోరీలకు పాల్పడి బంగారు ఆభరణాలు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చోరీసొత్తును బంగారు దుకాణాల్లో విక్రయించి న్యాయవాదికి ఫీజు చెల్లించి మిగిలిన డబ్బుతో జల్సాలు చేసేవారు. కోరమంగళ మాత్రమే కాకుండా ఆడుగోడి, తిలక్‌నగర, బొమ్మనహళ్లితో పాటు ఆరుకు పైగా పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో వెలుగుచూసిందని బెంగళూరు దక్షిణ డీసీపీ ఇషాపంత్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు