మరణంలోనూ వీడని స్నేహ బంధం..

15 Apr, 2018 08:45 IST|Sakshi
బొణికేల వేణు మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబ సభ్యులు..ఇన్‌సెట్లో వేణు (ఫైల్‌)

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

గొర్లెపాడులో విషాదం

మృత్యువులోనూ వీడని స్నేహం

సాక్షి, కవిటి / శ్రీకాకుళం : అభం శుభం తెలియని చిన్నారులను కోనేరు కాటేసింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. గ్రామంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. కవిటి మండలం గొర్లెపాడు గ్రామానికి చెందిన కర్రి చలమయ్య కుమారుడు దిలీప్‌ (8) బొణికేల పుణ్యవతి కుమారుడు వేణు (9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండేవారు. పాఠశాలకు కలిసే వెళ్లి వచ్చేవారు. శనివారం బడికి సెలవు కావడంతో ఆటాడుకోవడానికి ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు.

వారి కుటుంబ సభ్యులు కూడా ఉపాధి హామీ పథకం పనుల కోసం వెళ్లారు. తిరిగి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా పిల్లలు కనిపించలేదు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా పిల్లలు ఇంటికి చేరకపోవడంతో  కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై వెతకడం ప్రారంభించారు.  ఊరి చివర్లో ఉన్న కోవెల చెరువు గట్టుపై పిల్లల దుస్తులు కనిపించడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. స్నానానికి చెరువులో దిగి ఉండవచ్చునని భావించి కొంతమంది అందులో గాలించగా దిలీప్,వేణు శవాలై కనిపించారు. దీంతో కన్నవారు, గ్రామస్తులు గొల్లుమన్నారు.

ఆటలాడుకున్న పిల్లలు అలసిపోయి స్నానం కోసం దిగి నీట మునిగి చనిపోయి ఉండవచ్చునని గ్రామస్తులు భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉండే దిలీప్, వేణు మరణంలోనూ తోడుగా వెళ్లిపోవడంపై స్థానికులు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. పిల్లల మృతదేహాలను చెరువులో నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు వేణు తల్లి బొణికేల పుణ్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కవిటి ఎస్సై పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కర్రి దిలీప్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు..ఇన్‌సెట్లో కర్రి దిలీప్‌ (ఫైల్‌)

మరిన్ని వార్తలు