కడుపుకోత మిగిల్చిన ఈత సరదా

5 Aug, 2018 11:14 IST|Sakshi
కుమారుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి

కేసముద్రం వరంగల్‌: ఈత సరదా ఓ తల్లికి కడుపుకోతను మిగిల్చింది. బడి నుంచి ఇంటికి వచ్చిన కొడుకు తోటి మిత్రులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి నీటిమునిగి మృత్యుఒడిలోకి చేరిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై సతీష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలెపాక సుమలత,  కృష్ణ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. చిన్నకుమారు రోహిత్‌(9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుకుంటున్నాడు. ఈ మేరకు ఎప్పటిలాగే శుక్రవారం పాఠశాలకు వెళ్లి, తిరిగి సాయంత్రం బడి వదిలిపెట్టడంతో ఇంటికి వచ్చి పుస్తకాల బ్యాగ్‌ ఇంటి వద్ద పెట్టి, బయటకు వచ్చాడు.

ఇద్దరు స్నేహితులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ.. ఊరి చివరన ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక రోహిత్‌ చెరువులోకి దిగాడు. చెరువు అంచున వేసవికాలంలో చేపల కోసం తీసిన పెద్ద గుంతలో రోహిత్‌ మునిగిపోయాడు.  బయట ఉన్న స్నేహితులు భయంతో ఇంటికి పరుగుతీశారు. సాయంత్రం వరకూ రోహిత్‌ ఇంటికి చేరకపోవడంతో  తల్లి చుట్టుప్రక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. గ్రామస్తులు తోటి స్నేహితులను అడుగగా జరిగిన విషయం వెలిపారు. రాత్రి సమయంలో చెరువులోకి కొందరు వ్యక్తులు దిగి గాలించగా మృతదేహం లభ్యమైంది.  కొడుకు శవాన్ని చూసిన తల్లి ఒక్కసారిగా కుప్పకూలింది. శనివారం తల్లి సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా రోహిత్‌ మృతి చెందడంతో పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
నాడు భర్త.. నేడు కుమారుడు..
కూలీనాలి పనిచేసుకుంటూ జీవనం సాగించే కృష్ణ పాఠశాల ఎస్‌ఎంసీ వైస్‌ చైర్మన్‌గా పనిచేశాడు. ఈక్రమంలో గత ఏడాది క్రితం కృష్ణ మృతిచెందడంతో, కుటుంబ భారమంతా భార్య సుమలతపై పడింది. కాగా ఎస్‌ఎంసీ కమిటీ వైస్‌చైర్మన్‌గా సుమలతను ఎంపిక చేశారు. ఒకవైపు కూలీ పనిచేస్తూ ముగ్గురు పిల్లలను సాకుతూ వస్తుంది. బడిలో చదువుతున్న రోహిత్‌తో ఉపాధ్యాయులు స్నేహభావంతో మెదిలేవారు. రోహిత్‌ క్రీడల్లో, చదువులో రాణిస్తుండటంతో అతడికి మంచి ప్రోత్సాహన్ని ఇచ్చేవారు. అలాంటి విద్యార్థి మృతిచెందడంతో, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బాధను మిగిల్చింది. ఇంటిపెద్ద దిక్కును కోల్పోయిన బాధను మరువకముందే కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.

మరిన్ని వార్తలు