విషాదం నింపిన వేసవి

4 Jun, 2019 13:06 IST|Sakshi
చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

చెట్నేహళ్లిలో ఘటన

మంత్రాలయం/మంత్రాలయం రూరల్‌: బుడిబుడి నడకల సవ్వడి ఆ ఇళ్లలో మూగబోయింది. ముసిముసి నవ్వులు బోసిపోయాయి. అల్లారు ముద్దుగా పెరుగుతున్న పసి మొగ్గలు నేలరాలాయి.  సరదగా సాగాల్సిన వేసవి సెలవులు పెను విషాదం నింపాయి. ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృత్యువాత పడిన విషాద ఘటన మంత్రాలయం మండలం చెట్నేహళ్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. చెట్నేహళ్లి గ్రామానికి చెందిన చిన్న రాఘవేంద్రగౌడ్, ఉమాదేవి దంపతుల కుమారుడు కార్తీక్‌గౌడ్‌(9) మూడో తరగతి పూర్తి చేశాడు. అదే ఇంటి ఆడపడచు రాఘమ్మను ఆదోనికి చెందిన గురుపాదప్పకు ఇచ్చి వివాహం చేశారు. వీరి కుమారుడు పెద్ద బసవ (11) 5వ తరగతి పూర్తి చేశాడు.

వేసవి సెలవుల నిమిత్తం పెద్ద బసవ అమ్మమ్మ ఇల్లు చెట్నేహళ్లికి వచ్చాడు. సోమవారం బసవ, కార్తీక్‌ గ్రామ సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొందరు క్రికెట్‌ ఆడుతుండగా కాసేపు చూస్తూ ఉండిపోయారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో పక్కనే ఉన్న బావి వైపు చిన్నారులు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకపోవడంతో  క్రికెట్‌ ఆడుతున్న కొందరు అనుమానం వచ్చి బావి వైపు పరుగులు తీశారు. అప్పటికే చిన్నారులిద్దరు  కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో బావిలోకి దూకి బయటకు తీసి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని ప్రైవేటు వాహనంలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పెద్ద బసవ మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం ఆదోనికి తీసుకెళ్లగా, కార్తీక్‌ మృతదేహాన్ని చెట్నేహళ్లికి తరలించారు. 

మరిన్ని వార్తలు