హాస్టల్లో ఉన్నారనుకుంటే.. మూసీలో తేలారు!

27 Oct, 2019 04:18 IST|Sakshi
బ్రహ్మరెడ్డి (ఫైల్‌) , సూర్య(ఫైల్‌)

వారం కిందట జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి.. 

ప్రకాశం జిల్లాలో ఇద్దరు పిల్లల మృతి

పొదిలిరూరల్‌: పాపం ఆ నిరుపేద తల్లిదండ్రుల కష్టం ఎవరికీ రాకూడదు.. తమ పిల్లలు హాస్టల్లోనే ఉన్నారనుకున్నారు.. రోజూ స్కూల్‌కు వెళుతూ చక్కగా చదువుకుంటున్నారనుకున్నారు.. కానీ వారికి తెలియదు.. వారం కిందటే వారు మృత్యుఒడికి చేరారని.. తీరా విషయం తెలిశాక ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు బాదుకుంటూ రోదించారు.

ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పొదిలి మండలం ఏలూరు పంచాయతీలోని నల్లారెడ్డిపాలేనికి చెందిన చిన్నపురెడ్డి బ్రహ్మారెడ్డి (13), పొరుగూరు టి.సళ్లూరుకు చెందిన ఇండ్లా సూర్య (12) స్నేహితులు. వీరిద్దరు చీమకుర్తిలోని గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. ఈ నెల 19న తాము ఆధార్‌కార్డు తీసుకోవాలని పాఠశాల ఇన్‌చార్జికి లెటర్‌ రాసిచ్చి ఇంటికొచ్చారు.

ఆ సమయంలో ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో మూసీ నదికి ఈతకెళ్లారు. పిల్లలు ఇంటికొచ్చిన విషయం రెండు కుటుంబాలకూ తెలియదు. సూర్య తండ్రి ఒంగోలులో ట్రాక్టరు నడుపుతూ ఇంటికి వచ్చిపోతూ ఉంటాడు. ఆయన తన కుమారుడు సూర్యను దీపావళి పండుగకు ఇంటికి తీసుకెళదామని శుక్రవారం సాయంత్రం పాఠశాలకెళ్లాడు. 19వ తేదీనే సూర్యతో పాటు బ్రహ్మరెడ్డి కూడా పాఠశాల నుంచి వెళ్లారని అక్కడి సిబ్బంది చెప్పారు.

ఎంత వెతికినా పిల్లల ఆచూకీ దొరక్కపోవడంతో చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూసీనది ఒడ్డున ఇద్దరు పిల్లల దుస్తులున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ పరిసరాలకు వెళ్లి గ్రామస్తులు వెతకగా దుస్తులున్న ప్రదేశం నుంచి 300 మీటర్లు దూరంలో ఒక మృతదేహం, అక్కడికి  రెండు కిలోమీటర్ల దూరంలో మరో మృతదేహం కనిపించింది. మృతదేహం చేతికి ఉన్న దారం ఆధారంగా ఒకరిని సూర్యగా తల్లిదండ్రులు గుర్తించారు. పొదిలి సీఐ శ్రీరాం ఆధ్వర్యంలో ఎస్‌ఐ కె.సురేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు