బహిర్భూమికి వెళ్లి..విగత జీవులుగా మారి

10 Feb, 2019 08:04 IST|Sakshi
బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేస్తున్న కాటసాని శివనరసింహా రెడ్డి

వక్కెర వాగులో జారిపడి ఇద్దరు విద్యార్థుల మృతి 

శోక సముద్రంలో బాధిత కుటుంబాలు 

ఆర్థిక సహాయం అందించిన కాటసాని శివనరసింహారెడ్డి 

కల్లూరు: ఇంట్లో మరుగుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు విగతజీవులుగా మారారు. వక్కెర వాగులోని నీటి మడుగులో పడి తుదిశ్వాస విడిచారు. ఈ దుర్ఘటన శనివారం.. కల్లూరు అర్బన్‌ 33వ వార్డు పరిధిలో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామానికి చెందిన చిన్న కాటయ్య, తిరుపతమ్మ దంపతులు చిక్కు వెంట్రుకల వ్యాపారం చేస్తూ  శ్రీనివాసనగర్‌లో తొమ్మిదేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వీరికి  శివాజీ (10) తోపాటు మరో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శివాజి స్థానిక సెయింట్‌ థామస్‌ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన రామాంజి, ప్రమీళ దంపతులు కూడా తొమ్మిదేళ్ల క్రితం శ్రీనివాసనగర్‌లో గుడారాలు వేసుకుని చిక్కు వెంట్రుకల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

వీరికి ఇద్దరు కూతర్లు, ఇద్దరు కుమారులు ఉన్నాడు. పెద్దవాడు సారథి స్థానిక ధనారెడ్డి నగర్‌లోని మండల ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. అదే కాలనీకి చెందిన బబ్లూతో కలిసి సాయంత్రం బహిర్భూమికి వెళ్లారు. శుభ్రం చేసుకునేందుకు సమీపంలోని వక్కెర వాగులో నిలిచిన నీటి మడుగు వద్దకు వెళ్లారు. ఒకరి వెనుక ఒకరు వెళ్లుతుండగా ఇద్దరు స్నేహితులు నీటి మడుగులోకి జారిపడ్డారు. మూడోవాడు వాగు గట్టుమీదకు వచ్చి కేకలు వేశాడు. సమీపంలో ఉన్న బంధువులు, కాలనీవాసులు వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే నీటి మడుగులోకి జారిపడిన ఇద్దరు స్నేహితులు ఊపిరాడక ప్రాణాలు వదిలారు.  నీటి మడుగు నుంచి శివాజీ, సారథి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల బంధువులు, స్నేహితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. సమాచారం తెలుసుకున్న నాల్గో పట్టణ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
బాధితులకు ఆర్థిక సాయం 

విద్యార్థులు మృతి చెందారన్న సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి తనయుడు కాటసాని శివ నరసింహా రెడ్డి బాధిత కుటుంబాలకు వద్దకు వెళ్లారు. వారిని పరామర్శించి తమ ప్రగాఢసానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా