రైలుపట్టాలపై మిస్టరీ

9 Oct, 2018 13:35 IST|Sakshi
వెంకటేశ్వరపురం బ్రిడ్జి సమీపంలో మృతదేహం గోదాముల సమీపంలో పట్టాలపై మృతదేహాన్ని పరిశీలిస్తున్న నగర డీఎస్పీ మురళీకృష్ణ

వేర్వేరుచోట్ల రెండు మృతదేహాల లభ్యం

తొలుత జనావాసాల కనిపించిన వ్యక్తి కాలు

హత్య అంటూ ప్రచారం

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

కేసు విచారిస్తున్న నెల్లూరు, కావలి జీఆర్‌పీఎస్‌ పోలీసులు

నెల్లూరు(క్రైమ్‌): జనావాసాల నడుమ ఓ వ్యక్తి కాలు పడిఉండటం ఆ ప్రాంత వాసులను భయాందోళనకు గురిచేసింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కాలు ఎక్కడి నుంచి వచ్చిందని దర్యాప్తు ప్రారంభించారు. ఇంతలో రైలుపట్టాలపై రెండు మృతదేహాలు ఉండటం అందులోని ఓ మృతదేహానికి సంబంధించిన కాలుగా నిర్ధారించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం ఓ కుక్క కాలును తీసుకువచ్చి నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం శివాలయం వీధిలో పడవేసింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు భయాందోనకు గురై హత్య జరిగిందంటూ ప్రచారం చేయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు.

సంతపేట పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పాపారావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కాలును పరిశీలించారు. అప్పటికే వెంకటేశ్వరపురం గోదాముల సమీపంలో, వెంకటేశ్వరపురం బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలున్నట్లు సమాచారం రావడంతో ఆయన రైల్వేట్రాక్‌ వద్దకు చేరుకుని పరిశీలించారు. ఒక మృతదేహానికి తల, కాళ్లు లేకపోవడంతో దానికి సంబంధించిన కాలును కుక్క తీసుకువచ్చిందని నిర్ధారించారు. ఈక్రమంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ, నవాబుపేట ఇన్‌స్పెక్టర్‌ వెంకటరావులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివాలయం వీధిలో లభ్యమైన కాలు, రైల్వే ట్రాక్‌పై ఉన్న మృతదేహాలను పరిశీలించారు. అలాగే సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై బాలకృష్ణ మృతదేహాలను చూశారు. రెండు మృతదేహాల్లో ఒకటి నెల్లూరు జీఆర్‌పీఎఫ్‌ పరిధిలోకి రావడంతో శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. రెండో మృతదేహాన్ని కావలి జీఆర్‌పీఎఫ్‌ పోలీసులు స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించారు.

ఒకరి ఆచూకీ లభ్యం
కావలి పరిధిలోని రైల్వేట్రాక్‌పై మృతిచెందిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. మచిలీపట్నంకు చెందిన కాశి శివసాయి ప్రవీణ్‌ (23) సివిల్‌ ఇంజినీర్‌. అతను నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో సివిల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ వెంకటేశ్వరపురంలో తన తల్లితో కలిసి నివాసముంటున్నాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లోనుంచి బయటకు వచ్చాడు. సోమవారం వెంకటేశ్వరపురం గోదాముల సమీప రైలుపట్టాలపై మృతిచెంది ఉన్నాడు. ఘటనా స్థలంలో దొరికిన సెల్‌ఫోన్‌ ఆధారంగా మృతుడ్ని కావలి రైల్వే పోలీసులు గుర్తించారు.

పలు అనుమానాలు
కొద్దిదూరం వ్యవధిలోనే రైలుపట్టాలపై ఇద్దరు మృతిచెందారు. మృతదేహాలు పడి ఉన్న తీరును బట్టి ఆత్మహత్య చేసుకున్నారా? రైలు ఢీకొని మృతిచెందారా? మరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న కోణాల్లో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు