ప్రాణాలు తీసిన గుంత

16 Aug, 2018 13:04 IST|Sakshi
 నుజ్జునుజ్జుయిన సిమెంట్‌లోడు లారీ  

వరదకాలువలో లారీ బోల్తా

ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం

గుంతను తప్పించబోయి ప్రమాదం..

మల్యాల(చొప్పదండి) : రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయిన ఓ లారీ అదుపుతప్పి వరదకాలువలో పడిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వద్ద బుధవారం వేకువజామున జరిగింది. సుమారు 15మీటర్ల లోతు వరదకాలువలో పడడంతో లారీ నుజ్జునుజ్జయింది. పోలీసులు జేసీబీ సాయంతో మృతదేహాలను తీశారు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. 

మధ్యప్రదేశ్‌లోని ఖండువా జిల్లా దులార్‌పేట గ్రామానికి చెందిన ఇద్దరు డ్రైవర్లు జావేద్, ప్రదీప్, అదే గ్రామానికి చెందిన మరోవ్యక్తి ధర్మేన్‌మోరెతో కలిసి జగ్గయ్యపేట నుంచి సిమెంట్‌లోడుతో మహారాష్ట్ర వెళ్తున్నారు. మల్యాల మండలం నూకపల్లి వద్ద వరదకాలువ వంతెనపై ఉన్న భారీ గుంతను తప్పించబోయారు. దీంతో లారీ అదుపు తప్పి వంతెన రేలింగ్‌ను ఢీకొని వరదకాలువలో పడింది. దీంతో లారీ నుజ్జునుజ్జయ్యింది. అందులోని ఇద్దరు డ్రైవర్లు జావేద్‌(27), ప్రదీప్‌(28) అక్కడిక్కడే మృతిచెందారు.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగానే ఎస్సై నీలం రవి, సీఐ నాగేందర్‌ సంఘటనా స్థలానికి సందర్శించి, లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్ల మృతదేహాలను జేసీబీ సాయంతో వెలికితీశారు. మరోవ్యక్తి ధర్మేన్‌మోరెకు తీవ్ర గాయాలు కాగా.. జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.  

గుంతే కారణమా..? 

మల్యాల మండలంలోని నూకపల్లి వద్ద వరదకాలువ వంతెనపై ఉన్న భారీ గుంత వల్లనే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చర్చించుకుంటుకున్నారు. వేగంగా వెళ్తున్న సిమెంట్‌ లోడు లారీ టైర్లు గుంతలో పడగానే అదుపు తప్పి, వంతెన రేలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ప్రచారం జరుగుతోంది.

అధికారుల నిర్లక్ష్యం.. 

నూకపల్లి వరదకాలువ వంతెనపై తరచూ గుంత ఏర్పడడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. పలుమార్లు నూకపల్లికి చెందిన యువకులు శ్రమదానం చేసి పూడ్చినప్పటికీ నిత్యం వందలాది వాహనాలు ఇదే దారి గుండా వెళ్తుండడంతో గుంత ఏర్పడి, ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు మాత్రం గుంతపూడ్చే ప్రయత్న చేయకపోవడం, కనీసం వంతెన వద్ద రేడియం సూచిక బోర్డు ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది.

గతేడాది నవంబర్‌ 5న గుజరాత్‌లోని పోరుబందర్‌కు చెందిన జీవునాభాయి తమ్ముడు ఖారా భాయితో కలిసి గ్రానైట్‌ లోడ్‌ లారీతో మహారాష్ట్రకు వెళ్తుండగా, ఆపిల్‌ లోడ్‌తో జమ్ముకాశ్మీర్‌ నుంచి రాజమండ్రి వెళ్తున్న లారీ వంతెనపై ఉన్న గుంతను తప్పించబోయి గ్రానైట్‌ లారీని ఢీకొంది. ఈ సంఘటనలో జీవునాభాయి, ఖారాభాయి మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

మరిన్ని వార్తలు