కాటేసిన కరెంట్‌

27 Jan, 2018 08:17 IST|Sakshi
ప్రమాదానికి కారణమై హైటెన్షన్‌ లైన్‌

మాల్యవంతం.. మరణఘోష

బోరుబావిలోంచి పైపులు తీస్తుండగా విద్యుదాఘాతం

రైతుతోపాటు మెకానిక్‌ మృత్యువాత

వరుస ప్రమాదాలు..ఉన్నట్లుండి విషాద ఘటనలు..అనారోగ్యం బారిన పడి ఎవరో ఒకరు మృత్యువాత.. ఊరికి అరిష్టం పట్టుకుందని ఊరి జనం ఏకమయ్యారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి జంతుబలి ఇచ్చారు. ఊహించని విధంగా వైభవంగా జాతర జరిపించారు..పదిరోజులు గడిచాయి.. అంతా బాగుందనుకుంటుండగా ఉన్నపళంగా పిడుగులాంటి వార్త. కరెంటు కాటేసి ఇద్దరు మృత్యువాత పడడంతో మాల్యవంతంలో మళ్లీ విషాదం అలుముకుంది. 

బత్తలపల్లి: బోరుబావిలోంచి బయటకు తీసిన పైపు ఒరిగిపోయి విద్యుత్‌ తీగకు తగలడంతో కరెంట్‌ షాక్‌ తగిలి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఇద్దరి మృతితో రెండు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామానికి చెందిన దాసరి రాముడు అలియాస్‌ పూజారప్పకు కలికొండ సమీపాన పీఏబీఆర్‌ కుడికాలువ పక్కన రెండు ఎకరాల పొలం ఉంది. అందులో వరి సాగు చేశాడు. ప్రభుత్వం నూతనంగా ఇస్తున్న మోటారును అమర్చుకునేందుకు పాత మోటారును వెనక్కు ఇవ్వాల్సి ఉంది.

ఇందు కోసం రాముడు కుమారుడు రైతు దాసరి చంద్రశేఖర్‌ (30), తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన మెకానిక్‌ మధు (34) సాయంతో శుక్రవారం మధ్యాహ్నం బోరుబావిలోంచి పైపులు బయటకు తీస్తున్నారు. నాలుగో పైపు బయటకు తీసిన సమయంలో బరువు ఎక్కువై బావి వద్ద 15 అడుగుల ఎత్తులో ఉన్న 11కేవీ విద్యుత్‌ తీగలపైకి వాలింది. విద్యుదాఘాతానికి గురైన చంద్రశేఖర్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్రంగా గాయపడిన మెకానిక్‌ మధును 108 వాహనంలో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించేలోపే మధు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మధుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు
ప్రమాద విషయం తెలిసిన వెంటనే రెవెన్యూ సిబ్బంది మాల్యవంతం చేరుకుని వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించారు. ధర్మవరం రూరల్‌ సీఐ శివరాముడు, ఎస్‌ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వరుస ఘటనలతో బెంబేలు
మాల్యవంతం గ్రామంలో ప్రమాదాలు, అనారోగ్యాలు తదితర కారణాలతో ఎవరో ఒకరు మృత్యువాత పడుతున్నారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని ఈ నెల 16న పెద్దమ్మ దేవతకు జంతుబలి ఇచ్చారు. జాతరను వైభవంగా నిర్వహించారు. అయినా మరణాలు సంభవిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

కాపాడేందుకు వచ్చి గాయపడిన రైతు..
బోరుబావిలోంచి తీసిన పైపు విద్యుత్‌ లైనుపై పగడానే నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. పక్క పొలంలో ఉన్న రైతులు రంగనాథ్, క్రిష్టా, వసూరప్ప, బాలు తదితరులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దాసరి రాముడును జుట్టు పట్టుకుని పక్కకు లాగడంతో ప్రాణాపాయం తప్పి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రయత్నంలో రంగనాథ్‌ సైతం గాయపడ్డారు. బోరుబావి పక్కనే వరిపొలంలో నీరు ఉండడంతో ప్రమాదం నుంచి బయటపడలేక ఇద్దరు మృతువ్యాత పడ్డారు.

మరిన్ని వార్తలు