ఇద్దరు రైతుల ప్రాణం తీసిన అప్పు

1 Mar, 2018 06:59 IST|Sakshi
ఆత్మహత్యలకు పాల్పడ్డ హెమోజీ, రవి(ఫైల్‌ ఫోటో)

జగ్యా తండాలో కౌలు రైతు

మల్లెంపల్లిలో మరో రైతు బలవన్మరణం 

నర్సింహులపేట: అప్పుల బాధ ఇద్దరు రైతుల ప్రాణం తీసింది. పంట దిగుబడి లేక, పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులు పేరుకుపోవడంతో తీర్చే మార్గం లేక మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారు జగ్యాతండాకు చెందిన కౌలు రైతు భూక్య హెమోజీ(48) గత రెండు సంవత్సరాలుగా నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు.

పంట దిగుబడి లేక వచ్చిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు చేశాడు. అలాగే ఆరు నెలల క్రితం తన కుమారుడు వాసు రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతిచెందాడు. అతడికి ఆస్పత్రిలో చికిత్స కోసం కూడా తెలిసినవారినల్లా డబ్బులు అడిగాడు. దీంతో అతడికి రూ.4 లక్షల మేర అప్పులయ్యాయి.  ప్రస్తుతం ఎకరం భూమిలో టమాట సాగు చేశాడు. మంగళవారం సాయంత్రం తొర్రూరు సంతకు వెళ్లి టమాటాలు విక్రయించి రాత్రి ఇంటికి చేరుకున్నాడు.

లక్షలాది రూపాయల అప్పు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన అతడు బుధవారం వ్యవసాయ భూమిలో వేపచెట్టుకు ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కూతరు ఉన్నారు. ఎస్సై నగేష్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

మల్లెంపల్లిలో.. 
మల్హర్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం నాచారం పరిధిలోని మల్లెంపల్లికి చెందిన జింకల రవి(42) తనకున్న ఆరు ఎకరాల్లో నాలుగు ఎకరాలు మిర్చి, రెండు ఎకరాలు పత్తి సాగు చేశాడు. గత నాలుగేళ్లుగా పండించిన పంటలకు పెట్టుబడి పెరగడంతోపాటు దిగుబడి సక్రమంగా రాకపోవడంతో రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి.

ఈ క్రమంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురైన రవి మంగళవారం సాయత్రం తన పొలం వద్ద పురుగుల మందు తాగి ఇంటికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య  వినోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

మరిన్ని వార్తలు