‘మహర్షి’ సినిమా చూసి వస్తుండగా..

11 May, 2019 09:03 IST|Sakshi
కేతావత్‌ రూఫ్‌సింగ్, కేతావత్‌ గోపాల్‌నాయక్‌ (ఫైల్‌)

ఇద్దరిదీ ఒకే ఊరు.. పక్క పక్క నివాసాలు కావడంతో చిన్నప్పటి నుంచే వారిలో స్నేహబంధం చిగురించింది. ఎక్కడికి వెళ్లినా.. ఏ పనిచేసినా ఇద్దరూ కలిసి వెళ్లేవారు.. అదే తరహాలో ఇద్దరూ కలిసి తమ అభిమాన సినీ హీరో మహేశ్‌ బాబు నటించిన ‘మహర్షీ’ సినిమా చూసి ఇంటికి వెళుతూ అనుకోని ప్రమాదంలో మృత్యుఒడికి చేరుకున్నారు. ఈ విషాదకర ఘటన గురువారం అర్ధరాత్రి మిర్యాలగూడ పట్టణ పరిధిలో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో దామరచర్ల మండలం దిలావర్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధి మిట్టతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మిర్యాలగూడ టౌన్‌ : దామరచర్ల మండలం దిలావర్‌పూర్‌ గ్రామ పంచాయతీ పరిధి మిట్టతండాకు చెందిన కేతావత్‌ రూప్‌సింగ్‌(20), కేతావత్‌ గోపాల్‌నాయక్‌(20) పట్టణంలోని ఓ సెల్‌ షాపులో పని చేస్తుంటారు. రోజూ మాదిరిగానే విధులకు హాజరై ఈ ఇద్దరు స్నేహితులు కొత్త సినిమా రావడంతో రెండవ ఆట చూసి మిర్యాలగూడ నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యలో  ముత్తిరెడ్డికుంట సమీపంలో అద్దంకి–నార్కట్‌పల్లి బైపాస్‌ ఖలీల్‌ దాబా వద్ద రోడ్డు దాటుతున్న గేదెను రాత్రి 12:30గంటల సమయంలో వీరి బైక్‌ ఢీకొట్టింది. దీంతో కేతావత్‌ రూప్‌సింగ్‌ అక్కడికక్కడే మృతి చెందగా కేతావత్‌ గోపాల్‌నాయక్‌ తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఇద్దరినీ స్థానిక ఏరియా ఆస్పత్రికి  అక్కడి నుంచి గోపాల్‌నాయక్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు.

సెల్‌ షాపుల బంద్‌
ఇద్దరు యువకులు పట్టణంలోని సెల్‌ షాపుల్లో పని చేస్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆ దుకాణాల నిర్వాహకులు సంతాప సూచకంగా శుక్రవారం బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా మోబైల్‌ అసోసియేషన్‌ నాయకులు మాట్లాడుతూ నిత్యం నవ్వుకుంటూ ఉండే ఈ ఇద్దరు యువకులు ఆకాల మృతి తీరనిలోటన్నారు. వారి మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సెల్‌ ఫోన్‌ దుకాణాల నిర్వాహకులు హనుమయ్య, దేవిరెడ్డి నరేష్‌రెడ్డి, రాజశేఖర్, నాగరాజు, మసూద్‌ తదితరులున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా