అనుమానాస్పదం

10 Mar, 2018 08:54 IST|Sakshi
కూల్‌డ్రింక్‌ను పరిశీలిస్తున డీఎస్పీ కరీముల్లాషరీఫ్, సీఐ తమీంఅహమ్మద్‌

‘పురం’లో కలకలం..

ఇద్దరు యువకులు మృతి

మరొకరు ఆస్పత్రిపాలు

ఆహారం కలుషితమైందా.. ఆత్మహత్య చేసుకున్నారా?

ఆహారం, కూల్‌ డ్రింక్‌ ల్యాబ్‌కు పంపిన డీఎస్పీ

అల్పాహారం తిని శీతలపానీయం తాగిన ముగ్గురు యువకులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో ఒకరు, మార్గమధ్యంలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన హిందూపురంలో కలకలం రేపింది.

హిందూపురం అర్బన్‌: కర్ణాటకలోని గౌరీబిదనూరుకు చెందిన ప్రదీప్‌(30), పరిగి మండలం కాలువపల్లికి చెందిన శివ(29), హిందూపురంలోని కంసలపేటకు చెందిన బాలాజీ ముగ్గురూ స్నేహితులు. వీరు హిందూపురంలోని ముక్కడిపేటలోని ఒక అద్దెగదిలో ఉంటూ బంగారుదుకాణంలో పనిచేసేవారు. శుక్రవారం ఉదయం ప్రదీప్, శివ టిఫిన్‌ చేసేందుకని సమీపంలోని హోటల్‌ నుంచి పూరీలతోపాటు స్ప్రైట్‌ కూల్‌డ్రింక్‌ తెచ్చుకున్నారు. వీరిద్దరూ తింటున్న సమయంలో బయటి నుంచి బాలాజీ వచ్చి వారితో జతకలిశాడు. అలా ముగ్గరూ టిపిన్‌ తిని, కూల్‌డ్రింక్‌ తాగారు. ఎక్కువ మోతాదులో కూల్‌డ్రింక్‌ తాగిన శివ అపస్మారకస్థితికి చేరుకోగా.. కొద్దిసేపటికే ప్రదీప్‌ కుప్పకూలిపోయాడు.

కొద్దిగమాత్రమే కూల్‌డ్రింక్‌ తాగిన బాలాజీ వెంటనే తేరుకుని కేకలు పెట్టాడు. వీధిలో ఉన్న వారు పరుగున వచ్చారు. ఇంతలో బాలాజీ కూడా వాంతులు చేసుకుని పడిపోయాడు. 108 అంబులెన్స్‌లో ముగ్గురినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రదీప్‌ మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం నుంచి అనంతపురం తీసుకెళుతుండగా మార్గమధ్యంలో శివ చనిపోయాడు. బాలాజీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అనంతరం జరిగిన విషయాన్ని బాలాజీ పోలీసులకు తెలియజేశాడు. డీఎస్పీ కరీముల్లా షరీఫ్, టూటౌన్‌ సీఐ తమీమ్‌ అహ్మద్, ఎస్‌ఐలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.

కలుషిత ఆహారమా.. ఆత్మహత్య..?
కూల్‌డ్రింక్‌ లో ఏదైనా విష పదార్థాన్ని కలుపుకుని తాగి ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఆహారం కలుషితం కావడం వల్ల ప్రాణాలు కోల్పోయారా? అనే కోణంలో డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు తిన్న ఆహారం, కూల్‌డ్రింక్‌లను సీజ్‌చేసి వాటిని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు డీఎస్పీ చెప్పారు. అలాగే వీరి జీవనపరిస్థితులు ఇతర విషయాలపై కూడా ఆరా తీసుకున్నామని చెప్పారు. 

మరిన్ని వార్తలు