మృత్యువులోనూ వీడని స్నేహబంధం

2 Dec, 2019 09:26 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో ఘటన

సాక్షి, నకిరేకల్‌: ఆ.. ఇద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు.. బాల్యం నుంచి యుక్త వయసు వరకు కలిసే పెరిగారు.. ఎంతో కలివిడిగా ఉంటూ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళతారు.. వారిని చూసి విధికే కన్నుకుట్టిందేమో.. చివరకు ఇద్దరినీ ఒకేసారి మృత్యుఒడికి చేర్చింది. ఈ విషాదకర ఘటన చిట్యాల వాసులను ఎంతో కలిచివేసింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన చిట్యాల మండలం వట్టిమార్తి శివారులో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల పట్టణానికి చెందిన దేవిరెడ్డి మహేందర్‌రెడ్డి(31), ఊట్కూరి శ్రవణ్‌కుమార్‌రెడ్డి(27)లు స్నేహితులు.  వీరిలో మహేందర్‌రెడ్డి చిట్యాలలోనే ఎయిర్‌టేల్‌ నెట్‌వర్క్‌ డిస్ట్రిబ్యూటర్‌గా, శ్రవణ్‌కుమార్‌రెడ్డి ఐడియా డిస్ట్రిబ్యూటర్‌ వద్ద కలెక్షన్‌ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ తమ పనుల నిమిత్తం బైక్‌పై శనివారం నల్లగొండకు వెళ్లారు. అక్కడ పనులు పూర్తి చేసుకుని రాత్రి తిరుగుప్రయానమయ్యారు.

మహేందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డి మృతదేహాలు

మార్గమధ్యలో మండలంలోని వట్టిమర్తి గ్రామ పరిధిలో జాతీయ రహదారి పక్కన గల కేఎంసీఎల్‌ పరిశ్రమ వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను సిమెంటు లోడుతో వస్తున్న ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్‌రెడ్డిలు ఆ లారీ చక్రాల కింద పడి నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. మృతులిద్దరూ అవివాహితులు. సమాచారం మేరకు స్థానిక ఎస్‌ఐ రవి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారులు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడిపెట్టించింది. ఇద్దరు యువకుడు మృత్యువాత పడడంతో చిట్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా