‘ఇక మీకెవరికీ మేము కనిపించం’

17 Jun, 2020 13:34 IST|Sakshi
కొంగోడులో పొలం మడిలో యువకుల మృతదేహాలు

స్నేహితులతో ఆ యువకులన్న ఆఖరి మాటలివే..

పొలం మడిలో విగతజీవుల్లా మృతదేహాలు కొంగోడులో విషాదం  

ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు

గుట్టుగా మృతదేహాలకు అంత్యక్రియలు  

ఫిర్యాదు రాలేదన్న పోలీసులు  

తూర్పుగోదావరి, కాకినాడ రూరల్‌:  వారు ఏ రోజుకారోజు కూలి పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. సోమవారం రాత్రి స్నేహితులతో కలసి మద్యం సేవించారు. వారితో సరదాగా గడిపారు. ఇక మేమెవరికీ కనిపించబోమని, కువైట్‌ వెళ్లిపోతున్నామని చెప్పారు. తీరా మంగళవారం ఉదయం విగతజీవుల్లా పొలాల్లో పడి ఉన్నారు.. కరప మండలం కొంగోడు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటన ఇది.. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు నొక్కు సుబ్రహ్మణ్యం(19), అల్లంపల్లి దుర్గారావు(24) మృతి చెందారు.

ఎస్సీపేటకు చెందిన దుర్గారావు, సుబ్రహ్మణ్యం స్నేహితులు. కూలిపని చేసుకుని జీవనోపాధి పొందే వీరు సోమవారం రాత్రి స్నేహితులతో మద్యం సేవించి జల్దీఫైవ్‌ ఆట కొద్ది సేపు ఆడారు. మీకెవరికి కనిపించబోమని కువైట్‌ వెళిపోతున్నామని స్నేహితులతో చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. మంగళవారం ఉదయం పొలం మడిలో విగతజీవుల్లా పడి ఉండడంతో స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మద్యం మత్తులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకుండా మృత దేహాలకు గ్రామంలో అంత్య క్రియలను నిర్వహించారు. వివరాలు తెలిపేందుకు గ్రామస్తులు నిరాకరించారు. దీనిపై ఎస్సై రామారావును వివరణ కోరగా కొంగోడులో ఇద్దరు యువకులు మృతి చెందారని విన్నాం కానీ, తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదన్నారు.

మరిన్ని వార్తలు