కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినుల అదృశ్యం

30 Jan, 2018 15:04 IST|Sakshi
అదృశ్యమైన సౌజన్య, గౌరీ 

కొత్తగూడెం/చర్ల: కస్తూర్బా విద్యాలయం నుంచి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని లక్ష్మీకాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి భోజనం అనంతరం స్టడీ అవర్‌లో కూడా కూర్చున్న వీరిద్దరూ నిద్రకు ఉపక్రమించి.. తెల్లవారే సరికి కనిపించకపోవడంతో విద్యాలయ అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.  మండలంలోని కొయ్యూరు, సాయినగర్‌కాలనీలకు చెందిన గోటి గౌరి, బండారు సౌజన్య చర్లలోని కేజీబీవీలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసి 10.30 గంటలకు పడుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు విద్యార్థులను చదివించేందుకు సిబ్బంది నిద్ర లేపుతుండగా వీరిరువురూ కనిపించలేదు. ఈ విషయాన్ని సిబ్బంది విద్యాలయం ప్రత్యేకాధికారిణికి సమాచారం అందించారు. సిబ్బంది అంతటా వెదికినా ఆచూకీ తెలియకపోవడంతో విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలిపారు.

విద్యాలయానికి మూడు వైపులా ప్రహరీ గోడ, గేట్లకు తాళాలు వేసి ఉండగా వెనుకవైపున ఉన్న ప్రహరీగోడ కూలిపోయింది. అక్కడి నుంచే విద్యార్థినులు వెళ్లిపోయి ఉంటారని అంతా అనుమానిస్తున్నారు. విద్యాలయంలో ముందు భాగం, హాలులో మాత్రమే సీసీ కెమెరాలు ఉండగా విద్యార్థులు వెళ్లిన పుటేజీలు అందులో రికార్డు కాలేదు. ఎంఈఓ జుంకీలాల్, తహశీల్దార్‌ సురేష్‌కుమార్, ఎంపీపీ కోందరామయ్య, జడ్పీటీసీ సభ్యురాలు తోటమళ్ల హరిత విద్యాలయాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారుల సూచనల మేరకు విద్యాలయం ప్రత్యేకాధికారిణి చర్ల పోలీస్టేషన్‌ పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంబించారు. విద్యార్థినుల అదృశ్యానికి చదువుల ఒత్తిళ్లు కారణమా... సిబ్బంది మందలించారా... లేక మరేమైనా కారణాలున్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు