ఉలిక్కిపడ్డ నగరం

16 Mar, 2019 12:02 IST|Sakshi
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే వెంకటేశ్, కార్పొరేటర్‌ పద్మావతిరెడ్డి

న్యూజిలాండ్‌ దుర్ఘటనలో ఇద్దరు హైదరాబాదీలు

ఒకరికి గాయాలు, మరొకరి అదృశ్యం  

సాక్షి,సిటీబ్యూరో: న్యూజిలాండ్‌ క్రిస్ట్‌చర్చ్‌ సిటీలోని మసీదులో శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు హైదరాబాదీలు చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడగా, మరొకరు కనిపించడం లేదని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దుండగులు జరిపిన కాల్పుల్లో అంబర్‌పేట్‌లోని రహత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జహంగీర్‌ కుమారుడు ఇక్బాల్‌ జహంగీర్‌ గాయపడ్డాడు. టోలిచౌకి నదీమ్‌ కాలనీకి చెందిన సయీద్‌ ఉద్దీన్‌ కుమారుడైన ఫరాజ్‌ కనిపించకుండా పోయాడు. వారిని కాపాడాలంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కేంద్ర మంత్రి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీఎం కార్యాలయాలకు ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఫరాజ్‌ తండ్రికి మేయర్‌ పరామర్శ
గోల్కొండ: న్యూజిలాండ్‌లోని మసీదులో జరిగిన కాల్పుల సంఘటన టోలిచౌకిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాల్పుల సందర్భంగా కనిపించకుండా పోయిన 17 మందిలో ఫరాజ్‌ ఒకడు. టోలిచౌకి  నదీమ్‌ కాలనీకి చెందిన సయీద్‌ ఉద్దీన్‌ కుమారుడైన ఫరాజ్‌(31) తొమ్మిదేళ్ల క్రితం న్యూజిలాండ్‌ వెళ్లి అక్కడ ఐటీ నిపుణుడిగా స్థిరపడ్డాడు. ప్రత్యేక ప్రార్థనలకు స్నేహితులతో కలిసి మసీదుకు వెళ్లిన ఫరాజ్‌ తిరిగి రాలేదు. కాగా నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, కార్వాన్‌ ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌తో కలిసి శుక్రవారం రాత్రి నదీమ్‌ కాలనీలోని ఫరాజ్‌ ఇంటికి వెళ్లి అతని తండ్రి సయీద్‌ ఉద్దీన్‌ను పరామర్శించారు. ఫరాజ్‌కు ఏడేళ్ల క్రితం వివాహమైంది. భార్య ఇన్షా అజీజ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అంబర్‌పేటలో
అంబర్‌పేట: న్యూజిలాండ్‌లోని మసీదులో దుండగుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇక్బాల్‌ జహంగీర్‌ కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి మేయర్‌ రామ్మోహన్‌ పరామర్శించి ఓదార్చారు. అంబర్‌పేట్‌లోని రహత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ జహంగీర్‌ కుమారుడు ఇక్బాల్‌ జహంగీర్‌ 15 ఏళ్ల క్రితం న్యూజిలాండ్‌ వెళ్లి çహోటల్‌ వ్యాపారంలో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి పోయేవాడు. శుక్రవారం ప్రార్థనల సమయంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇక్బాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న నగరంలోని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వారిని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్లు కె.పద్మావతిరెడ్డి, పులి జగన్‌ పరమర్శించారు.    

మరిన్ని వార్తలు