‘కోల్డ్‌’ వార్‌!

18 May, 2018 09:51 IST|Sakshi

రెండు ఐస్‌క్రీమ్‌ సంస్థల మధ్య వివాదం

ఒకరికి ఫోన్‌ చేస్తే  మరొకరికి వెళ్తున్న కాల్‌

తమవి హ్యాక్‌ చేశారని క్రీమ్‌ స్టోన్‌ ఫిర్యాదు

సాక్షి, సిటీబ్యూరో: వేసవి కాలం వచ్చిందంటే శీతల పానీయాలతో పాటు ఐస్‌క్రీమ్‌లకు భారీ డిమాండ్‌ ఉంటోంది. కస్టమర్లకు చేరువకావడానికి అనేక సంస్థలు పలు సౌకర్యాలు కల్పిస్తుంటాయి. గూగుల్‌లో తమ నెంబర్లను పొందుపరచడం, కాల్‌ చేసిన వారికి డోర్‌ డెలివరీ ఇవ్వడం వీటిలో ఒకటి. క్రీమ్‌ స్టోన్‌ సంస్థకు చెందిన ఈ ‘సౌకర్యం’ హ్యాకింగ్‌కు గురైందని దాని ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన కాల్స్‌ హావ్‌మోర్‌ సంస్థకు వెళ్తున్నాయంటూ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌  చాంద్‌బాషా దర్యాప్తు ప్రారంభించారు. ప్రముఖ ఐస్‌క్రీమ్స్‌ విక్రయ సంస్థ క్రీమ్‌స్టోన్‌కు నగర వ్యాప్తంగా అనేక ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. గూగుల్‌ అందిస్తున్న ‘నియర్‌ బై’ సదుపాయంలో భాగంగా వీటి వివరాలతో పాటు ఫోన్‌ నెంబర్లను ఆ సంస్థ పొందుపరిచింది. ఓ ప్రాంతంలో ఉన్న వారు ఎవరైనా క్రీమ్‌స్టోన్‌ ఔట్‌లెట్‌కు వెళ్లాలని భావించినా, హోమ్‌ డెలివరీ కోసం ఆర్డర్‌ చేయాలనుకున్నా గూగుల్‌ ద్వారా తమ దగ్గరలో ఉన్న దానిని వెతుకుతుంటారు.

ఇలా సెర్చ్‌ చేసినప్పుడు గూగుల్‌ ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న/ప్రముఖ క్రీమ్‌స్టోన్‌ ఔట్‌లెట్స్‌ వివరాలు చెప్పడంతో పాటు వాటి ఫోన్‌ నెంబర్లను డిస్‌ప్లే చేస్తుంది. ఈ వివరాల ఆధారంగా వినియోగదారులు ఆయా స్టోర్స్‌కు వెళ్లడమో, ఆర్డర్లు ఇచ్చి ఐస్‌క్రీమ్స్‌ ఇంటికి తెప్పించుకోవడమే చేస్తుంటారు. క్రీమ్‌స్టోన్‌ సంస్థకు చెందిన వినియోగదారులు కొందరు ఇటీవల గూగుల్‌ ద్వారా సెర్చ్‌ చేసినప్పుడు వివరాలు ఆ సంస్థలకు చెందినవే ఉంటున్నా... ఫోన్‌ నెంబర్లు మాత్రం హావ్‌మోర్‌ సంస్థకు చెందినవి డిస్‌ప్లే అవుతున్నాయి.

దీంతో ఈ నెంబర్లకు కాల్స్‌ చేస్తే అవి హావ్‌మోర్‌ సంస్థ/ఔట్‌లెట్స్‌కు చేరుతున్నాయి. ఫలితంగా కొంత మేరకు వ్యాపారం వీరికి మళ్లుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన క్రీమ్‌స్టోన్‌ ఐస్‌క్రీమ్‌ వినియోగదారులు సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారూ సరిచూసుకోగా ఈ విషయం నిర్థారణ కావడంతో క్రీమ్‌స్టోన్‌ ఆపరేషన్స్‌ మేనేజర్‌ రెహ్మత్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొందరు దురుద్దేశంతోనే తమ సంస్థ ఔట్‌లెట్స్‌కు చెందిన గూగుల్‌లో ఉన్న డేటాబేస్‌ను హ్యాక్‌ చేసి, వేరే సంస్థ ఫోన్‌ నెంబర్లు ఉండేలా చేశారని అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి చీటింగ్‌ సెక్షన్‌తో పాటు ఐటీ యాక్ట్‌లోని 66 సీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు