శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్‌ నేతల మృతి

22 Apr, 2019 11:45 IST|Sakshi

కొలంబో : శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటకలోని జేడీఎస్‌ పార్టీకి చెందిన ఏడుగురు నేతలు అదృశ్యమయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ వెల్లడించారు. వారిని కేజీ హనుమంతరాయప్ప, ఎం. రంగప్పగా గుర్తించారు. వీరంతా ఎన్నికల ప్రచారం అనంతరం ఈ నెల 20న శ్రీలంకకు వెళ్లారు. కొలొంబోలోని ‘ద షాంగ్రిలా హోటల్‌’లో రెండు గదుల్లో బస చేసినట్లు సమాచారం. అదే చోట బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. అదృశ్యమైన వారిలో శివన్న, పుట్టరాజు, మునియప్ప, లక్ష్మీనారాయణ, మారేగౌడ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

చదవండి : దివ్య సందేశంపై రాక్షస కృత్యం!

కాగా జేడీఎస్‌ నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నేతల గల్లంతు తనను షాక్‌ గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. గల్లంతైన నేతల ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన సంఖ్య 290కి చేరింది. 500మందికి పైగా గాయపడ్డారు.

మరిన్ని వార్తలు