గుండెపోటుతో ఇద్దరు జర్నలిస్టుల మృతి

10 Jul, 2018 09:12 IST|Sakshi
వెంకటస్వామిగౌడ్‌,  సిద్ధిరాములు(ఫైల్‌)

గుండెపోటుతో చానల్‌ రిపోర్టర్‌..

చిన్నశంకరంపేట(మెదక్‌): చిన్నశంకరంపేటకు చెందిన టీవీ చానెల్‌ రిపోర్టర్‌ మేడి సిద్దిరాములు(30) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. ఆదివారం రాత్రి వరకు ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లో బంధువులతో గడిపిన సిద్దిరాములు నిద్రలోనే గుండెపోటుకు గురై మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది.

ప్రజాశక్తి, ఆంధ్రప్రభ పత్రికల్లో పనిచేసిన సిద్దిరాములు కొంత కాలంగా మహ న్యూస్‌ చానెల్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు తల్లి లక్ష్మి, ముగ్గురు సోదరులున్నారు.  సోమవారం మధ్యాహ్నం నిర్వహించిన అంత్యక్రియల్లో తల్లి లక్ష్మి తలకొరివి పెట్టడం అక్కడివారిని కలచివేసింది.

అంత్యక్రియల్లో చిన్నశంకరంపేట, రామాయంపేట, మెదక్‌ ప్రెస్‌క్లబ్‌ సభ్యులు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు. మెదక్‌ నియోజకవర్గ టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, రామాయంపేట ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు సంపత్, చిన్నశంకరంపేట ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు యాదగిరి, ఏఎంసీ చైర్మన్‌ నరేందర్, సర్పంచ్‌ కుమార్‌గౌడ్, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల సమన్వకర్త లక్ష్మారెడ్డి, ఎంపీటీసీలు వెంకటేశం, ఏదుల్‌ పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందిస్తాం

చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన రిపోర్టర్‌ సిద్దిరాములు కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని టీయూడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి తెలిపారు. సిద్దిరాములు మృతి విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించినట్లు తెలిపారు. అలాగే ప్రెస్‌ ఆకాడమీ నుంచి మరో రూ.లక్ష అందించనున్నట్లు తెలిపారు. D

దుబ్బాకలో సీనియర్‌ జర్నలిస్ట్‌..

దుబ్బాకటౌన్‌: సీనియర్‌ జర్నలిస్టు, మన తెలంగాణ దుబ్బాక విలేకరి పల్లె వెంకటస్వామిగౌడ్‌ గుండెపోటుతో ఆదివారం రాత్రి మరణించారు. ఆయనకు ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంట్లోనే తీవ్రంగా ఛాతిలో నొప్పి వచ్చింది.

ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. వెంకటస్వామిగౌడ్‌ మృతితో తోటి జర్నలిస్టులు, స్నేహితులు, బంధువులు షాక్‌కు గురయ్యారు. 14 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తూ ప్రజలతో మంచి సంబంధాలు కల్గి ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరు పెట్టారు.

సంతాప సూచకంగా దుబ్బాకలో ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు సోమవారం స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి.  వెంకటస్వామి అంతిమయాత్రలో సిద్దిపేట జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షులు రంగచారి అంతిమయాత్రలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు