అయ్యో పాపం..

3 Jul, 2018 09:02 IST|Sakshi
మృతిచెందిన సోనిప్రియ, ప్రదీప్‌

అస్వస్థతకు గురికావడమే కారణం

తల్లడిల్లిన తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్య

శోకసంద్రంలో జాలిగామ గ్రామం

గజ్వేల్‌రూరల్‌: పొద్దంతా ఆడుతూపాడుతూ గడిపిన పిల్లలు.. రాత్రి ఒక్కసారిగా అనారోగ్యానికి గురై ఒకరి తర్వాత ఒకరు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు అచేతనంగా మిగిలిపోయారు. మృత్యువు తమ పిల్లలను బలితీసుకుందంటూ ఒకవైపు తల్లిదండ్రులు.. మరోవైపు నానమ్మ, తాతయ్య రోదించడంతో ఆ గ్రామం తల్లిడిల్లిపోయింది. ఈ విషాదకర ఘటన గజ్వేల్‌ మండలం జాలిగామలో సోమవారం జరిగింది.

పుప్పాల పద్మ, స్వామి దంపతులకు సోనిప్రియ(10), ప్రదీప్‌(6) పిల్లలు. గజ్వేల్‌లోని సెయింట్‌ పీటర్స్‌ పాఠశాలలో సోనిప్రియ 5వ తరగతి, ప్రదీప్‌ యూకేజీ చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి వద్దే ఆడుకున్నారు. ఈక్రమంలో మధ్యాహ్నం పిల్లలిద్దరూ అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు.

దీంతో స్వామి గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్ద పిల్లలతో పాటు తాను అస్వస్థతతో ఉండటంతో చికిత్స చేయించుకున్నాడు. అనంతరం రాత్రి సమయంలో వేర్వేరు గదుల్లో తల్లిదండ్రుల వద్ద ప్రదీప్, నానమ్మ, తాతయ్య వద్ద సోనిప్రియ నిద్రించారు. అర్థరాత్రి దాటిన తర్వాత ప్రదీప్‌కు జ్వరం తీవ్రం కావడంతో వెంటనే గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

రోదనలతో ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. సోనిప్రియ సైతం అస్వస్థతకు గురైనట్టు గుర్తించి ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో బాలిక అపస్మారక స్థితికి చేరుకోవడంతో గ్రామంలోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే సోనిప్రియ మృతిచెందినట్టు గుర్తించారు. ఒకరి తర్వాత మరొకరు నిమిషాల వ్యవధిలో మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

తెల్లవారేసరికి ఈ విషయం గ్రామస్తులందరికి తెలిసింది. ఆడుతూపాడుతూ గడిపిన చిన్నారులు మృత్యుఒడికి చేరుకోవడం గ్రామంలో విషాదం నిందింది. మృతుల కుటుంబసభ్యులను కాంగ్రెస్‌ నేతలు ప్రతాప్‌రెడ్డి, జశ్వంత్‌రెడ్డి, శ్రీకాంత్‌రావు పరామర్శించారు. కాగా, ఘటనపై డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ బలరాం మాట్లాడుతూ.. మృతి చెందిన పిల్లల రక్తనమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించామన్నారు.


 

మరిన్ని వార్తలు