ఇంజినీరింగ్‌ విద్యార్థులే టార్గెట్‌

10 Jan, 2018 07:38 IST|Sakshi

ఐదుగ్రాముల గంజాయి ప్యాకెట్‌ రూ.100 చొప్పున విక్రయం

సిగరెట్లలో గంజాయి నింపుకుని తాగుతున్న యువకులు

ఇద్దరి విక్రేతలను అరెస్టు చేసిన పోలీసులు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌(గన్నవరం):ఇంజినీరింగ్‌ విద్యార్థులు, యువతను టార్గెట్‌ చేసుకుని గంజాయి విక్రయాలు సాగిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో సీఐ వై.వి.వి.ఎల్‌.నాయుడు, ఎస్సై వి.సతీష్‌ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. నూజివీడు మండలం రాట్నాలగూడెంకు చెందిన జి.మనోజ్‌కుమార్, ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన నక్కా చిన్న వెంకటేశ్వరరావు కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల కిందట అనుమానాస్పదంగా సంచరిస్తున్న మనోజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించామని చెప్పారు. ఆయన వద్ద ఆరు గంజాయి ప్యాకెట్లు లభించాయని పేర్కొన్నారు.

తదుపరి విచారణలో నక్కా చిన్న వెంకటేశ్వరరావు నుంచి నిషేధిత గంజాయి కొనుగోలు చేసినట్లు వెల్లడించటంతో అతనిని కూడా అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. వీరిద్దరి నుంచి ఒక కేజీ 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రధానంగా హనుమాన్‌జంక్షన్, గన్నవరం, నూజివీడు, ఏలూరు ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఐదు గ్రాముల గంజాయి కలిగిన ఒక్కో ప్యాకెట్‌ను రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు  చెప్పారు. యువత అధికంగా గంజాయికి అలవాటు పడుతున్నారని, సిగిరెట్లలో గంజాయి నింపుకుని సేవిస్తున్నారన్నారు. ఈ కేసుపై మరింత దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని, గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్‌ టీంను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేసుతో సంబంధం ఉన్న హనుమాన్‌జంక్షన్‌కు చెందిన కొందరు పెద్ద మనుషుల కుమారులను పోలీసులు తప్పించారని వస్తున్న ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా, సీఐ దీన్ని పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. కేసు విచారణ పూర్తి కాలేదని, ఇంకా లోతైన విచారణ సాగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు