దండుపాళ్యం బ్యాచ్‌లో ఇద్దరి అరెస్టు

4 Aug, 2019 08:19 IST|Sakshi
నిందితులను మీడియాకు చూపిస్తున్న చీరాల డీఎస్పీ

రెండున్నర సవర్ల బంగారం, నగదు స్వాధీనం

సాక్షి, చీరాల: కొంతకాలంగా దండుబాటలో దండుపాళ్యం బ్యాచ్‌ మాదిరిగా తయారై దారి దోపిడీలు, లైంగిక దాడులకు పాల్పడుతూ చీరాలలో భయానక వాతావరణం సృష్టిస్తున్న పలు ముఠాలకు చెందిన వారిలో వన్‌టౌన్‌ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి బంగారం, నగదు స్వాదీనం చేసుకున్నారు. శనివారం రాత్రి ఒన్‌టౌన్‌ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. దండుబాటలో కొంతకాలంగా అసాంఘిక శక్తులు కొందరు దారి దోపిడీలు, లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిపై ఒన్‌టౌన్‌ సీఐ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో కొన్ని బృందాలు నిఘా ఉంచాయి.

గత నెల 25వ తేదీ రాత్రి 8 గంటలకు కారంచేడు మండలం జరుబులవారిపాలేనికి చెందిన కొల్లూరి చిన్న సుబ్బారావు స్వర్ణ దారిలో వెళ్తుండగా ఇద్దరు మురుగు కాలువ సమీపంలో అడ్డుకుని అతనిపై దాడి చేసి బెదిరించి అతని వద్ద ఉన్న రూ.1200 నగదు, రెండున్నర సవర్ల బంగారాన్ని లాక్కుని సెల్‌ఫోన్‌ను పగలగొట్టారు. అదే మార్గంలో వస్తున్న ద్విచక్ర వాహనాలను చూసి నిందితులు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఒన్‌టౌన్‌ సీఐ దర్యాప్తు చేయగా నిందితులైన గాంధీనగర్‌కు చెందిన మత్తు శివశంకర్, పెదప్రోలు శివబ్రహ్మారెడ్డి అనే 20 ఏళ్ల యువకులను దండుబాట ప్రాంతంలో అరెస్టు చేసి వారి వద్ద ఉన్న బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేసును త్వరగా ఛేదించిన సీఐ నాగమల్లేశ్వరరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు