ఆలస్యంగా వస్తామంటూ..

20 Nov, 2019 10:44 IST|Sakshi
శివ, సాయి

యువకుల మృతిపై పలు అనుమానాలు

తమ కుమారుల్ని హత్య చేసి రైలు పట్టాలపై పడేశారంటున్న తల్లిదండ్రులు

సాక్షి, పీలేరు: మండలంలోని నెట్టిబండ సమీపంలో సోమవారం ఇద్దరు యువకులు రైలు పట్టాల వద్ద గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలై వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. స్థానిక కావలిపల్లెకు చెందిన సాయి (19), యర్రావారిపాళెం మండలం, ఓఎస్‌ గొల్లపల్లెకు చెందిన బి. శివకుమార్‌ (26) ఇరువురూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం విదితమే. చిత్తూరు మార్గంలోని రైల్వే గేటు నుంచి తిరుపతి రైల్వే మార్గంలో 3 కిలోమీటర్ల దూరంలో మృతదేహాలు ఉన్నట్లు సోమవారం తెల్లవారుజామున 5–6 గంటలకు గుర్తించారు. మృతదేహాల వద్ద లభించిన ఏటీఎం కార్డు ఆధారంగా మృతులను పోలీసులు గుర్తించి సమాచారం చేరవేయడంతో వారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.  తమ కుమారులు ఆత్మహత్య చేసుకోడానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, ఎవరో హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రైలు పట్టాలపై పడేశారని అనుమానాలు వ్యక్తం చేశారు.  ఇదే విషయంగా శివకుమార్‌ తండ్రి వెంకట్రమణ, సాయి తండ్రి రాజన్న మంగళవారం పీలేరులో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆలస్యంగా వస్తామంటూ..
శివకుమార్, సాయి ఇరువురూ ఆదివారం రాత్రి తమ తల్లిదండ్రులతో మాట్లాడారు. పీలేరులో ఉన్నామని, ఆలస్యంగా ఇంటికి వస్తామని చెప్పారని వారి తల్లిదండ్రులకు చెప్పారు. ఆది వారం రాత్రి పొద్దుపోయినా సాయి  ఇంటికి రాకపోవడంతో అదేరోజు రాత్రి 11 గంటలకు అతడి తండ్రి సాయికి ఫోన్‌ చేశారు. తాను క్రాస్‌ రోడ్డులో ఉన్నానని, ఇంటికి వస్తానని సాయి చెప్పడంతో తల్లిదండ్రులు ధైర్యంగా ఉండిపోయారు. అయితే సాయి, శివకుమార్‌ మృతదేహాలు రైలు పట్టాలపై పడి ఉన్నాయని తెలియడంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.

సెల్‌ఫోన్లు ఏమయ్యాయి..?
సాయి, శివకుమార్‌ వద్ద ఎప్పుడూ సెల్‌ఫోన్లు ఉంటాయని, ప్రమాదం జరిగిన తరువాత అవి ఏమయ్యాయో తెలియడం లేదని మృతుల తల్లిదండ్రులు చెప్పారు. దీంతో తమ కుమారుల మృతిపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. మృతదేహాలకు మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు