మృత్యు శకటం

28 Aug, 2018 12:24 IST|Sakshi
సంఘటన స్థలం వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు

ద్విచక్రవాహనాన్నిఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ముగ్గురి మృత్యువాత

సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద ఘటన    

శోకసంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు

‘ఆయన లేకపోయినా ఇద్దరు బిడ్డలే రెండు కళ్లనుకున్నా.. ఒక బిడ్డపోయాక రెండో బిడ్డపై ఆశలు పెట్టుకున్నా..ఇప్పుడు..ఆ కన్ను కూడా పొడిచేసి నన్ను దుఃఖాల చీకట్లోకి నెట్టేశావా.. ఇంకెవరి కోసం బతకాలి భగవంతుడా’.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న శివయ్య(25) తల్లి కడుపుకోత కట్టలు తెంచుకుంది. అరగంటలో ఇంటికి వస్తానన్నావు కదయ్యా.. అర్ధంతరంగా మమ్మల్ని అన్యాయం చేసి వెళ్లిపోయావా.. అంటూ నాగేశ్వరరావు(65) భార్య గుండెలు బాదుకుంది. నాన్నా.. నన్ను చూడాలనిపించి బయలుదేరావా.. ఒక్క మాట చెబితే నేనే వచ్చేదాన్ని కదా.. ఇప్పుడు మన ఇంటికొచ్చాను నాన్నా.. ఒక్కసారి లే నాన్నా..అంటూ యల్లయ్య(65) కూతురు హృదయవిదారకంగా రోదించింది. సోమవారం సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురిని మృత్యువు మింగేసింది. బస్సు చక్రాల కింద చిందిన రక్తం.. ప్రతి గుండెపై కన్నీటిగా మారింది. మృతుల   బంధువుల రోదన బెల్లంకొండ మండలంలోని రెండు గ్రామాల్లో    విషాద గీతికై  ప్రతిధ్వనించింది.  

ధూళ్లిపాళ్ల(సత్తెనపల్లి):  ప్రమాదం ఎటువైపు పొంచి ఉందో తెలియదు. ఎంత జాగ్రత్తగా వెళుతున్నా ఎదుటి వారు సక్రమంగా రాకపోతే భారీ ప్రమాదాలు క్షణంలోనే జరిగిపోతుంటాయి. అందుకు నిదర్శనం సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం. సత్తెనపల్లి రూరల్‌ ఇన్‌చార్జి సీఐ పి.శరత్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్ల వద్ద సోమవారం ఉదయం ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామానికి చెందిన కోమటి యల్లయ్య(65), నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పిట్టల నాగేశ్వరరావు(65), పిట్టల శివయ్య(25) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. గోనెపూడి నుంచి ముగ్గురు ద్విచక్రవాహనంపై బెల్లంకొండ వెళుతుండగా మాచర్ల నుంచి గుంటూరు వెళుతున్న గుంటూరు–1 డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఆటోను క్రాస్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ద్విచక్రవాహనం నడుపుతున్న పిట్టల శివయ్య, వెనుక కూర్చున్న కోమటి మల్లయ్యలు బస్సు ముందు భాగంలోకి ఇరుక్కు పోయి మృతి చెందగా పిట్టల నాగేశ్వరరావు కొంత దూరంలో పడి మృతి చెందాడు.

ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.  ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. నాగిరెడ్డిపాలెంకు చెందిన పిట్టల నాగేశ్వరరావు, పిట్టల శివయ్య వరుసకు తండ్రీకొడుకులు. ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసం కాగా ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలానికి సత్తెనపల్లి రూరల్‌ ఇన్‌చార్జి సీఐ పి.శరత్‌బాబుతో పాటు పిడుగురాళ్ల రూరల్‌ సీఐ సుబ్బారావు,  సత్తెనపల్లి రూరల్‌ ఎస్‌ఐ మీర్జా నజీర్‌బేగ్, రాజుపాలెం ఎస్‌ఐ రమేష్, క్రోసూరు ఎస్‌ఐ కొండలు, ఆర్టీసీ డిపో మేనేజర్‌ ఆర్‌.మంత్రూనాయక్, బెల్లంకొండ ఎంపీపీ చెన్నుపాటి పద్మావెంకటేశ్వరరెడ్డి చేరుకొని మృతదేహలను పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు ప్రైవేట్‌ అంబులెన్స్‌లో తరలించారు. మృతుడు పిట్టల నాగేశ్వరరావు కుమారుడు పిట్టల సాంబయ్య ఫిర్యాదు మేరకు  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

శివయ్య కుటుంబాన్ని వెంటాడిన మృత్యువు
బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెంకు చెందిన  పిట్టల శివయ్య(25) కుటుంబాన్ని మృత్యువు వెంటాడిది.  ఆరు నెలల క్రితం శివయ్య సోదరుడు వెంకయ్య రైలు ఢీకొని మృతి చెందాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి వెంకట్రావు నరాలు పగిలి మరణించారు. ఇప్పుడు శివయ్య కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం మగ ఆధారం కోల్పోయి రోడ్డున పడింది. కుమారుడి మరణ వార్తను తెలుసుకున్న తల్లి వెంకటరమణ రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.

కడసారి కుమార్తెను చూడకుండానే....
బెల్లంకొండ మండల మాచాయపాలెం గ్రామానికి చెందిన కోమటి యల్లయ్య తన రెండో కుమార్తె వెంకమ్మను చూసేందుకు కోటప్పకొండ సమీపంలోని గోనెపూడి గ్రామం వచ్చారు.  తీరా గోనెపూడి గ్రామానికి యల్లయ్య వెళ్లే లోగా కుమార్తె వెంకమ్మ మాచాయపాలెం చేరుకుంది. సోమవారం ఉదయం నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పిట్టల నాగేశ్వరరావు, శివయ్యలతో కలసి యల్లయ్య ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో బస్సు ఢీకొని మృతి చెందాడు. ‘కడసారి కుమార్తెను చూడకుండానే లోకం విడిచి వెళ్లావా నాన్నా’..  అంటూ మృతుడి మూడో కుమారుడు వెంకటేశ్వర్లు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

వస్తున్నానని చెప్పిన కొద్దిసేపటికే..
బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంకు చెందిన పిట్టల నాగేశ్వరరావు ఆదివారం కోటప్పకొండ సమీపంలోని గోనెపూడి బంధువుల వద్దకు వెళ్లాడు. సోమవారం ఇంటికి వస్తున్నానని చెప్పిన కొద్ది సమయానికి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి భార్య శివమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది.

మరిన్ని వార్తలు