రుషికొండ తీరంలో మృత్యుఘోష

1 Oct, 2018 08:16 IST|Sakshi
పవన్‌కుమార్‌ మృతదేహానికి పంచనామా చేస్తున్న పోలీసులు

గడిచిన ఆరేళ్లలో 10 మంది దుర్మరణం

అయినప్పటికీ కానరాని హెచ్చరిక బోర్డులు

తాజాగా ఇద్దరు విద్యార్థులు గల్లంతు

వారిలో తీరానికి చేరిన ఒకరి మృతదేహం

సాగర్‌నగర్‌ (విశాఖ తూర్పు): సహజ అందాలకు నిలయమైన రుషికొండ తీరంలో మృత్యఘోష వినిపిస్తోంది. అమాయకులైన విద్యార్థులు, పర్యాటకులను రాకాసి అలలు కాటేస్తున్నాయి. పోలీసుల వైఫల్యం... అధికారులు నిర్లక్ష్యం కారణంగా గడిచిన ఆరేళ్లలో పది మంది దుర్మరణం పాలయ్యారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎక్కడి నుంచో విహార యాత్రకై వచ్చి సముద్రంలోకి దిగి భీకర అలల తాకిడితో మృత్యు ఒడికి చేరుతున్నారు. సముద్రంలో స్నానాలు చేయరాదంటూ పోలీసులు నామమాత్రంగా హెచ్చరిస్తుండడం ప్రమదాలకు కారణమవుతోంది. ప్రమాదాల నివారణకు పర్యాటక శాఖ, జీవీఎంసీ అధికారులు శాశ్వత చర్యలు నేటికీ చేపట్టకపోవడం శోచనీయం. తాజాగా ఆదివారం సాయంత్రం ఇద్దరు విద్యార్థులను అలలు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆదివారం సముద్రంలోకి దిగి స్నానాలు చేస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు పవన్‌కుమార్, హరికుమార్, వంశీని రాకాసి అలలు లాగేయగా... వీరిలో వంశీని లైఫ్‌గార్డులు జి.రాజేష్, కె.రాజు, జి.రాజ్‌కుమార్, సీహెచ్‌.మురళీ సకాలంలో కాపాడడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. రాకాసి అలలకు బలైపోయిన పవన్‌కుమార్‌ మృతదేహాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలిస్తున్నట్టు పీఎం పాలెం సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. హరికుమార్‌ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సంఘటన స్థలానికి ఆరిలోవ సీఐ తిరుపతిరావు చేరుకున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే
2012లో సాయిప్రియ రిస్సార్ట్స్‌ వెనుక తీరంలో గీతం వర్సిటీకి చెందిన ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. 2014లో ఆరిలోవకు చెందిన ఇద్దరు విద్యార్థులు మునిగిపోయారు. 2016లో ద్వారకానగర్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న ముగ్గురు యువకులు స్నానాలు చేస్తూ భీకర అలలకు గురై గల్లంతయ్యారు. అనంతరం మూడు రోజుల తర్వాత వీరి మృతదేహాలు తీరానికి చేరాయి. ఇలా ఏడాదికి కనీసం ఇద్దరు లేక ముగ్గురి ప్రాణాలు పోతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూరని మృతుల తల్లిదండ్రులు, పర్యాటకులు విమర్శిస్తున్నారు. గతంలో నగర పోలీస్‌ కమిషనర్‌గా  జె.పూర్ణచంద్రరావు ఉన్న సమయంలో ఇక్కడ హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిత్యం పోలీసులు, మెరైన్‌ పోలీసులు, మరోవైపు లైఫగార్డుల పర్యవేక్షణ ఉండేది. ముఖ్యంగా సముద్రంలో దిగి స్నానం చేసే పర్యాటకులను పరిశీలిస్తూ లైఫ్‌గార్డులు హెచ్చరించేవారు. అనంతరకాలంలో వారికి నెలనెలా జీతాలు చెల్లించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాగే ఆరిలోవ, పీఎంపాలెం పోలీస్‌ స్టేషన్‌ల నుంచి ఒక్క కానిస్టేబుల్‌ కూడా తీరంలో పహారా కాయడం లేదు. నామమాత్రంగా మెరైన్‌ పోలీస్‌లు ఒకరిద్దరు వాచ్‌ టవర్‌ వద్ద కాలక్షేపంగా కూర్చుంటున్నారు. తీరంలో స్నానాలు చేసే పర్యాటకులను హెచ్చరించేవారే లేకుండాపోయారు. ఈ కారణంగానే విహారయాత్రకని వచ్చి రుషికొండ తీరానికి బలైపోతున్నారని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు