ఇద్దరి సజీవ దహనం

7 Sep, 2018 13:37 IST|Sakshi
రోదిస్తున్న మృతుడు బత్తిన నూకరాజు భార్య శాంతి ,మృతులు బత్తిన నూకరాజు, బత్తిన ప్రసాద్‌ (ఫైల్‌)

 ఉలిక్కిపడిన శంఖవరం

పాత కక్షలే కారణమంటున్న స్థానికులు

ఉద్రిక్త వాతావరణంలో శంఖవరం ఎస్సీపేట 144 సెక్షన్‌ విధింపు 

వారం కిందట జరిగిన ప్రేమ వివాహం... ఇరు కుటుంబాలను ఒప్పించి ఇద్దరూ ఒక్కటయ్యారు ... బంధు, మిత్రులకు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు...ఇందుకు వారం రోజుల ముందునుంచీ సందడే సందడి. ఆ రోజు రానే వచ్చింది. ఆ జంటలో ఆనందం ... ఓ వైపు వచ్చీపోయే వారితో ఆ ప్రాంగణం సందడిగా మారింది. అంతలోనే విషాదం...ఇరు వర్గాల మధ్య చిన్నగా ప్రారంభమైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. కత్తిపోట్ల వరకూ వెళ్లింది. ఇది సహించని ప్రత్యర్థివర్గం కత్తితో దాడి చేసిన అన్నదమ్ములపై దాడికి దిగారు. వారు పారిపోతున్నా వెంట తరిమారు. వారిద్దరూ ఓ ఇంటి గదిలో దాక్కున్న విషయం గమనించి పెట్రోలు పోసి నిప్పంటించడంతో సజీవ దహనమయ్యారు. కాపాడండంటూ ఆర్తనాదాలు చేస్తున్నా ... అక్కడే అందరూ ఉన్నా ... ఏ ఒక్కరూ రక్షించే సాహసం చేయలేకపోయారు.

తూర్పుగోదావరి, శంఖవరం: శంఖవరం ఎస్సీపేటలో ఇద్దరి వ్యక్తుల సజీవ దహనంతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గ్రామంలో ఎస్సీపేటలో పులి సుధాకర్, మీరా రాజేంద్రప్రసాద్, హత్యకు గురైన బత్తిన నూకరాజు, ప్రసాద్‌ మధ్య తలెత్తిన వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌వీ రామారావు, ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో ఎస్సీపేటలో కర్కట నాగేశ్వరరావు కుమారుడు ప్రసాద్, పులి మోజేష్‌ కుమార్తె శిరీషల ప్రేమ వివాహం సందర్భంగా గురువారం రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పెళ్లి కుమారుడు తరఫు బంధువులు మృతులు బత్తిన నూకరాజు, ప్రసాద్, పెండ్లి కుమార్తె తరఫున పులి సుధాకర్, మేరా రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఒకరినొకరు ఘర్షణకు దిగారు.

ఈ నేపథ్యంలో మృతులు నూకరాజు, ప్రసాద్‌లు ప్రత్యర్థి వర్గీయులైన పులి సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ల వర్గీయులతో కవ్వింపు చర్యలు దిగి దాడి చేశారు. ఈ దాడిలో సుధాకర్, రాజేంద్రప్రసాద్‌లను బత్తిన నూçకరాజు, ప్రసాద్‌లు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ వారి అనుచరులతో కలసి నూకరాజు, ప్రసాద్‌లను వెంటాడారు. సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ వర్గీయుల నుంచి తప్పించుకోవడానికి ముందుగా బుద్ధాల లోవరాజుకు చెందిన ఇంట్లోకి వెళ్లారు. అక్కడ ఆ ఇంటిపై దాడి చేయడంతో ప్రాణభయంతో మరలా ఎదురుగా ఉన్న పెండ్లి కుమారుడు తండ్రి కర్కాట నాగేశ్వరరావు ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో సుధాకర్, రాజేంద్రప్రసాద్‌ తదితరులు ఆ ఇంటిని చుట్టుముట్టి  గది తలుపులకు తాళాలు వేసి గది పక్కనే ఉన్న కిటికీలోంచి పెట్రోల్‌ బాటిళ్లు విసిరి నిప్పుపెట్టారు. దీంతో లోపల ఉన్న పర్నీఛర్‌ అంటుకుని మంటలు చెలరేగి గదిలో దాగి ఉన్న నూకరాజు, ప్రసాద్‌లు సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలంలో వందలాదిమంది ప్రజలు ఉన్నా సుధాకర్, రాజేంద్రప్రసాద్, తదితరులు చేస్తున్న దాడులకు భయపడి వారందరూ పరుగులు తీశారు.

గ్రామంలో 144సెక్షన్‌ విధింపు
ఘటనా స్థలానికి పెద్దాపురం ఆర్డీఓ వసంతరాయుడు, తహసీల్దార్‌ ఎం.సుజాత, పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌వీ రామారావు చేరుకున్నారు. గ్రామంలో పర్యటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ విధించారు.

పోలీసుల అదుపులో పలువురి నిందితులు
ఈ ఘటనకు సంబంధించి పలువురి నిందితులను పులి సుధాకర్, మేరా రాజేంద్రప్రసాద్, మేరా సుశీల, పులి కృష్ణ, కాపారపు సింహాచలం, కాపారపు నానిబాబు, తదితరులును అదుపులోకి తీసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ సీహెచ్‌వీ రామారావు తెలిపారు. పూర్తి నేరపరిశోధన జరిపి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

భయాందోళనలో ఎస్సీపేట
బత్తిన నూకరాజు, బత్తిన ప్రసాద్‌ల హత్యతో శంఖవరం ఎస్సీపేటవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ హత్యాఘటనతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు హడలెత్తిపోతున్నారు. గ్రామంలో ఈ ఘోర హత్యతో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

మరిన్ని వార్తలు