తీగలే.. మృత్యుపాశాలై..

6 Jul, 2020 12:31 IST|Sakshi

విద్యుత్తు షాక్‌కు గురై ఇద్దరు యువకుల మృతి

పొట్టకూటి కోసం వచ్చిన వలస కూలీలు

జీవితాల్లో వెలుగును నింపే విద్యుత్తు.. ప్రాణాలనూ హరిస్తోంది. కూలి పనుల కోసం వచ్చిన అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు విద్యుత్తు షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారు. ఓ యువకుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇస్తామంటూ ట్రాన్స్‌కో అధికారులు బాధితులనుఆదుకుంటున్నారు.  

తూర్పుగోదావరి, శంఖవరం: బతుకుతెరువు కోసం ఇతర జిల్లాలకు వెళ్లిన ఇద్దరి కూలీల బతుకులు.. విద్యుత్తు షాక్‌తో ముగిసిపోయాయి. వారిలో ఒకరు వివాహితుడు, మరొకరు అవివాహితుడు. మరొకరు షాక్‌ నుంచి ప్రాణాలను దక్కించుకున్నాడు. పాత వజ్రకూటం పంచాయతీ పరిధి రామన్నపాలెం పొలాల సమీపంలో అలానా కంపెనీకి చెందిన పశువుల కబేళాలో ఆదివారం బోరు తవ్వుతున్నారు. ఈ బోరు తవ్వుతుండగా విద్యుత్తు షాక్‌కు గురై ఇద్దరు యువకులు డేరాంగుల అంకన్న (35), అరిజన రమేష్‌ (23) మృతి చెందగా, మరో కూలి స్వల్ప గాయాలతో ప్రాణాలను దక్కించుకున్నాడని పోలీసులు తెలిపారు. అన్నవరం ఎస్సై మురళీమోహన్‌ కథనం ప్రకారం..

అనంతపురం జిల్లా నుంచి ఐదుగురు యువకులు కూలి పని కోసం వచ్చి కత్తిపూడిలో ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే పలుచోట్ల వారు అనేక బోర్లు తవ్వారు. ఉదయం యథావిధిగా లారీతో కూడిన మెషినరీతో బోరు తవ్వుతుండగా పొలాల మీదుగా వెళ్లిన 11 కేవీ విద్యుత్తు తీగలు మెషీన్‌కు తగిలాయి. దీంతో దానిపై పని చేస్తున్న ఈ ఇద్దరు యువకులు షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలంలో ఉన్న కూలీలు రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన అనంతపురానికి చెందిన అంకన్నకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మరో మృతుడు రమేష్‌.. అనంతపురం జిల్లా కనిగళ్ల మండలం గోపాలపురానికి చెందిన వాడు. ఇదే గ్రామానికి చెందిన హరిజన నాగార్జునుడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. రెండు మృతదేహాలను పోలీసులు ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి
కూలి పని కోసం వచ్చి మృత్యువాత పడిన మృతుల కుటుంబాలకు అలానా కంపెనీ భారీ నష్ట పరిçహారం చెల్లించాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు హాని కలిగే పనులను కంపెనీ నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు నష్ట çపరిçహారం చెల్లించకుంటే కంపెనీ చేయించే పనుల వద్ద ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు