ఆ సంపద వెనుక?

23 Jul, 2018 10:34 IST|Sakshi
లాకర్ల యజమాని అవినాశ్‌ అమరలాల్‌, ఇదే ఆ లాకర్లున్న గది

ఇద్దరు మంత్రులు, ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే హస్తం

ఐటీ అదుపులో వ్యాపారవేత్త అవినాశ్‌  

లాకర్లో రూ.250 కోట్ల ఆస్తుల డాక్యుమెంట్లు

ఇంకా ఎన్ని క్లబ్బుల్లో లాకర్లు ఉన్నాయోనని అనుమానం

 ఒక సాధారణ టెన్నిస్‌కోర్టు లాకర్లో గుట్టలు గుట్టలుగా నగదు, బంగారు, వజ్రాలు, ఆస్తుల పత్రాలు వెలుగుచూడడం ఉద్యాననగరిలో చర్చనీయాంశమైంది. లాకర్ల సొంతదారు అవినాశ్‌ అమరలాల్‌తో పాటు ఇంకా కొందరు బలమైన రాజకీయ నాయకులకు ఈ లాకర్‌ సంపదలో భాగస్వామ్యం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.  

యశవంతపుర:    బెంగళూరులోని బౌరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని లాకర్లో పెద్దమొత్తంలో దొరికిన నగదు, నగల వ్యవహారంపై అనేక అనుమానాలు వెంటాడుతున్నాయి. రాజస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త అవినాశ్‌ అమరలాల్‌ కుక్రేజా బినామీ పేరుతో క్లబ్‌లో లాకర్‌ తీసుకుని డబ్బులను దాచిన్నట్లు పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం సంపదను ఐటీ స్వాధీనం చేసుకోవడంతో కొందరు మంత్రులకు ఊపిరి ఆడడం లేదని సమాచారం. అవినాశ్‌ను ఐటీ అదుపులోకి తీసుకుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం కర్ణాటకకు చెందిన ఇద్దరు బలమైన మంత్రులు, బళ్లారికి చెందిన ఒక కాంగ్రెస్‌ శాసనసభ్యునికి  చెందిన ఆస్తిపత్రాలు ఈ లాకర్లో లభించినట్లు తెలిసింది. శనివారం ఇక్కడ మూడు లాకర్లను అధికారులు బద్దలు కొట్టగారూ.3.90 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన వజ్రాలు, వందల కోట్ల ఆస్తుల డాక్యుమెంట్లు దొరకడం తెలిసిందే. దీంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. పోలీసులు, ఐటీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక బ్యాగ్‌లో రెండు వేలకు పైగా సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, బెంగళూరులోని సహకార నగరలోని 250 కోట్ల విలువ గల ఐదు ఎకరాల భూమి పత్రాలు, శోభా డెవలపర్స్, ఇట్టినా, నితీశ్, ప్రెస్టిజ్‌  డెవలప్‌మెంట్‌ సంస్థలకు చెందిన పత్రాలున్నాయి. అవినాశ్‌కు మైసూరులో, బెంగళూరులో అనేక ఇళ్లు ఉన్నాయి.  

గుట్టుగా ఉంచేందుకు లంచం ఎర  
 అవినాశ్‌ బెంగళూరు టౌన్‌హాల్‌ ఎదురుగా భవనంలో తన ఆఫీసు నిర్వహిస్తున్నారు. రెండు, మూడు పడక గదులున్న నివాసాలు, లెక్కలేనన్ని ఇంటి స్థలాలు ఈ డాక్యుమెంట్లలో ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. లాకర్‌లోని సంపద బయటకు రాకుండా చూస్తే రూ.4 కోట్ల ముడుపులు ఇస్తానని బౌరింగ్‌ క్లబ్‌ కార్యదర్శి ప్రకాశ్‌కు ఆశ చూపారు. గంట తర్వాత ఒక సీనియర్‌ మంత్రి అనుచరుడు ప్రకాశ్‌ను కలిసి రూ. 5కోట్లు తీసుకోండి, ఎవరికీ చెప్పవద్దు అనిఆయనకు ప్రలోభాలకు గురిచేశారు. కానీ  క్లబ్‌ కార్యదర్శి ససేమిరా అని తన నిజాయితీని చాటుకోవడంతో ఈ భారీ ధనం దందా బయట పడింది. ఎలాగైనా విచారణను అడ్డుకోవాలని ప్రయత్నంలో అవినాశ్‌ పెద్దస్థాయిలో లాబీ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అవినాశ్‌ను ప్రశ్నిస్తున్న ఐటీ
కోట్ల రూపాయిల విలువగల ఆస్తి పత్రాలు, నగదు, అభరణాలకు సంబంధించి వ్యాపారవేత్త అవినాశ్‌ అమరలాల్‌ను ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆస్తి ఎలా వచ్చింది, బౌరింగ్‌ లాకర్‌లో ఎందుకు దాచిపెట్టారు? అని ప్రశ్నిస్తున్నారు. అతనికి చెందిన అగర్వాల్‌ బ్యాంక్‌ ఖాతానూ ఆరా తీస్తున్నారు. మొదట అక్రమ ఆస్తుల కేసును నమోదు చేసి తరువాత లోతుగా విచారణ చేయాలని నిర్ణయించారు. ఐటీ అధికారులు ఈ నగదు, నగల వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి అందించారు. సహకార నగరలోని 5 ఎకరాల భూమి విలువను 250 కోట్లగా లెక్కించారు.  

తెరవెనుక ఉన్నవారెరు?  
ఈ సంపదపై ప్రభావం చూపుతున్న ఇద్దరు మంత్రులు, బళ్లారి జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఎవరు అనేదానిపై పలు ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. అవినాశ్‌ బెంగళూరులో ఇంకా ఎన్ని క్లబ్‌లలో సభ్యత్వం తీసుకుని అక్కడ లాకర్లను తెరిచి నగలు, నగదును దాచారోనని ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. బౌరింగ్‌ టెన్నిస్‌ కోర్ట్‌లోనే ఇంత డబ్బులుంటే ఇతర ప్రాంతాలలో ఆయన సంపద అధికంగా ఉంటుందని అనుమానిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా