వేధింపుల పర్వం

3 Dec, 2019 04:02 IST|Sakshi

ఆరేళ్ల చిన్నారిని చిదిమేసిన ట్రక్కు డ్రైవర్‌

జైపూర్‌: ఆరేళ్ల చిన్నారిని రేప్‌ చేసి, హత్య చేసిన ఓ ట్రక్కు డ్రైవర్‌ను రాజస్తాన్‌లోని టొంక్‌ జిల్లాలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. చాక్లెట్లు ఇస్తానని చెప్పి, స్కూల్‌ వద్ద నుంచి తీసుకెళ్లిన నిందితుడు మహేంద్ర అలియాస్‌ ఢోలు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుడు చిన్నారికి తెలిసిన వ్యక్తి కావడంతో.. తల్లిదండ్రులకు చెబుతుందేమోనన్న భయంతో పాపను అక్కడే చంపేశాడని ఎస్పీ ఆదర్శ్‌ తెలిపారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ సమయంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడ్డ తర్వాత  రాజస్తాన్‌ విడిచి పారిపోవాలని భావించాడని, అయితే అలీగఢ్‌లో పట్టుపడ్డాడని వివరించారు. నిందితుడి వయసు 41 ఏళ్లు ఉంటుందని, ట్రక్కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అతడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని ఎస్పీ తెలిపారు. శనివారం పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత చిన్నారి కన్పించడం లేదని మొత్తం వెతికారు. మరుసటి రోజు ఉదయం స్కూల్‌ సమీపంలో పాప శవమై కన్పించింది. స్కూల్‌ బెల్టుతో మెడకు బిగించి ఊపిరాడకుండా చంపేశాడని పోలీసులు తెలిపారు.   

కన్న తండ్రే కూతురిపై..
జైపూర్‌: సొంత తండ్రే కన్న కూతురిని గొలుసులతో కట్టేసి, హింసించి, పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డ హేయమైన ఘటన రాజస్తాన్‌లోని జలోర్‌ జిల్లాలో జరిగింది. తన తండ్రి వేరే మహిళతో చనువుగా ఉన్న సమయంలో తాను చూశాననే కోపంతో గొలుసులతో తన కాళ్లు, చేతులు కట్టేసి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఇంటి నుంచి బాధితురాలు శుక్రవారం తప్పించుకుని తన మేనమామ పొలం దగ్గరికి వచ్చింది. అప్పటికీ తన చేతులు గొలుసులతో కట్టేసి ఉన్నాయి. జరిగిన విషయాన్ని తన మేనమామతో చెబితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ ఇంట్లో జరిగే హింసను తట్టుకోలేక బాధితురాలి తల్లి ఏడేళ్ల కిందటే నిందితుడిని వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.  

ఒడిశాలో గ్యాంగ్‌ రేప్‌.. నిందితుల్లో కానిస్టేబుల్‌
పూరి: ఒడిశాలోని పూరీలో సోమవారం ఓ మహిళపై గ్యాంగ్‌రేప్‌ జరిగింది. కాకట్‌పర గ్రామానికి చెందిన బాధితురాలు నిమపరలోని బస్టాండ్‌ వద్ద బస్‌ కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి కారులో వచ్చిన ఓ వ్యక్తి..కాకట్‌పర తీసుకెళ్తానంటూ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో కారులో మరో ముగ్గురు వ్యక్తులున్నారు. బాధితురాలిని ఝడేశ్వరి క్లబ్‌ పక్కనున్న పోలీస్‌ క్వార్టర్ల వద్దకు తీసుకెళ్లి ఇద్దరు రేప్‌ చేశారు. అక్కడ తనకు దొరికిన పర్స్‌ను బాధితురాలు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదుచేసింది. అందులోని ఐడీకార్డుల ద్వారా నిందితుడైన కానిస్టేబుల్‌ను  సస్పెండ్‌ చేసి, అరెస్ట్‌చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా