ఖాళీ ఇన్వాయిస్‌లతో కాజేశారు

22 Dec, 2019 04:53 IST|Sakshi

ఐఎంఎస్‌ కుంభకోణంలో మరో ఇద్దరు అరెస్ట్‌

25 వరకు డొల్ల కంపెనీలతో వ్యవహారం

అక్రమ డబ్బుతో కామారెడ్డిలో భూముల కొనుగోలు

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ డైరెక్టర్‌ దేవికారాణి, మాజీ జేడీ కలకుంట్ల పద్మలు నకిలీ బిల్లులతో, బినామీ కంపెనీలతో ఇష్టానుసారంగా పాల్పడ్డ అక్రమాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దేవికారాణికి ఈ కుంభకోణంలో సహకరించిన సికింద్రాబాద్‌లోని విశాల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌కి చెందిన పందిల్ల భూపాల్‌రెడ్డి, సికింద్రాబాద్‌లోని వసుధ మార్కెటింగ్‌కి చెందిన రెడ్డిమల్లి నాగేందర్‌రెడ్డిలను ఏసీబీ శనివారం అరెస్టు చేసింది.

ఎలా మోసం చేశారంటే..?
ఎలాంటి టెండర్లు లేకుండా నాన్‌ రేటెడ్‌ కంపెనీ (ఎన్‌ఆర్‌సీ)లతో కుమ్మక్కయిన దేవికారాణి కొందరితో ఏకంగా డొల్ల కంపెనీలు ప్రారంభించింది. తేజ ఫార్మా కంపెనీకి చెందిన పందిరి రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు ఈ దందాలో భూపాల్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డి బాగా సహకరించారు. అధిక ధరలకు కోట్‌ చేసిన ఖాళీ బిల్లులు, ఇన్వాయిస్‌లు, సాఫ్ట్‌కాపీలు సృష్టించి, సనత్‌నగర్‌లోని దేవికారాణి నమ్మిన బంటు ఫార్మాసిస్టు కొడాలి నాగలక్షి్మకి ఇచ్చేవారు. ఆమె వాటిని దేవికారాణి వద్దకు తీసుకెళ్లి సంతకాలు చేయించి నిధులు విడుదలయ్యేలా చూసేది. వీరిచేత దేవికారాణి దాదాపు 25 డొల్ల కంపెనీలు తెరిపించినట్లుగా ఏసీబీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. లేని కంపెనీలతో బిల్లులు పెట్టడం, వాటికి చెల్లింపులు చేయడం, తర్వాత అంతా కలిసి పంచుకోవడం ద్వారా ఈఎస్‌ఐ సొమ్మును కాజేశారని ఏసీబీ ఉన్నతాధికారులు వివరించారు.

వచ్చిన సొమ్ముతో భూముల కొనుగోలు
డొల్ల కంపెనీలు తెరిపించడంలో, నకిలీ బిల్లులు సృష్టించడంలో తేజఫార్మా, దేవికారాణికి సహకరించినందుకు వీరికీ భారీగా ముడుపులు ద క్కాయి. ఈ డబ్బులతో భూపాల్‌రెడ్డి, నాగేందర్‌రెడ్డిలు కామారెడ్డి జిల్లా బికనూర్‌ వద్ద భారీగా వ్యవసాయ భూములు కొనుగోలు చేశారని విచారణలో తేలింది. నిందితులిద్దరిపైనా కుట్ర, మో సం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకు  తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా