గన్‌ ఫైట్‌ : కోర్టు హల్లో తండ్రి హత్యకు ప్రతీకారం!

17 Dec, 2019 16:26 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నూర్‌ జిల్లా కోర్టులో కాల్పుల కలకలం రేగింది. రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న షానవాజ్‌ అన్సారీని ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. జిల్లాలోని నజీబాబాద్‌ నియోజకవర్గ బీఎస్పీ ఇన్‌చార్జి హజీ అసన్‌ (50), అతని మేనల్లుడిని గత మే నెలలో ఇద్దరు వ్యక్తులు కాల్చి చంపారు. నిందితుల్లో ఒకరైన షానవాజ్‌ ఈ ఇద్దరినీ తానే చంపానని ఢిల్లీ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతన్ని మంగళవారం బిజ్‌నూర్‌ జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

అయితే, కోర్టులో వాదనలు జరుగుతుండగా..  హజీ అసన్‌ కొడుకు, మరో ఇద్దరు సాయుధులు షానవాజ్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కోర్టు సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. ఇక కాల్పుల నేపథ్యంలో కోర్టులో భీతావహ వాతావరణం నెలకొంది. న్యాయమూర్తి, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు చెక్క బల్లల కింద దాక్కుని ప్రాణాలు రక్షించుకున్నారు. కాల్పులకు తెగబడ్డ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి సంజీవ్‌ త్యాగి చెప్పారు. వ్యాపార సంబంధ కారణాలతోనే ఈ హత్యలు జరిగినట్టు స్థానిక పోలీసులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు