మద్యం మత్తులో హత్యలు

15 Nov, 2019 13:13 IST|Sakshi
పోలీసుల అదుపులో వేర్వేరు కేసుల నిందితులు ఖాదర్‌వలి, తిమ్మయ్య, రామకృష్ణ

కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త  

తమ్ముడిని చంపిన అన్న

నిందితులను పట్టుకున్న పోలీసులు

వారం రోజుల వ్యవధిలో మద్యం మత్తులో రెండు దారుణాలు జరిగాయి. ఒకరేమో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చాడు.మరొకరు తన స్నేహితుడితో కలిసి తమ్ముడిని చంపేశాడు. ఈ రెండు కేసులను పోలీసులు వేగంగా ఛేదించి, నిందితులను కటకటాల వెనక్కి పంపారు.

రాయచోటి టౌన్‌ : రాయచోటి సబ్‌ డివిజన్‌ పరిధిలో ఇటీవల రెండు హత్యలు జరిగాయి. ఈ రెండు కూడా మద్యం ‘మత్తు’లో జరిగినవేనని పోలీస్‌ అధికారులు తెలిపారు. రాయచోటిలో తాగుడికి బానిసైన ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. సుండుపల్లె మండలంలో వరుసకు సోదరుడినైన యువకుడిని అన్న హతమార్చా డు. ఈ వివరాలను రాయచోటి అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో గురువారం పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. ఈ నెల 8న అర్ధరాత్రి లక్కిరెడ్డిపల్లె మండలం మద్దిరేవులకు చెందిన షేక్‌ ఖాదర్‌వలి (46) రాయచోటి పట్టణంలోని కొత్తపేటలో బాలాజీ నగర్‌ ఏటీఎంకు దగ్గరగా నివా సం ఉంటున్నారు. అతను మద్యం దుకాణంలో పని చేసే వాడు. మద్యానికి బానిస అయ్యాడు. తాగేందుకు డబ్బులు తక్కువ వచ్చిన ప్రతి సారి అమ్మ, భార్య దగ్గర తీసుకుని వెళ్లేవాడు. వారు ఇవ్వనంటే గొడవ పడే వాడు. ఈ క్రమంలో స్వగ్రామం మద్దిరేవుల వద్ద ఉన్న మామిడితో టను అమ్మేందుకు సిద్ధపడుతుండగా.. ఆయన భార్య నూర్జహాన్‌ (40) వద్దని వారించింది. కోపోద్రిక్తుడైన ఖాదర్‌వలి కొడవలితో తలపై దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాడు. ఆమె కుప్పకూలి కిందపడి పోయింది. మరింత కోపంతో ఇంటిలోని రోకలి బండతో తలపై బలంగా మోది చంపేశాడు. అడ్డు వచ్చిన కుమారుడు మహమ్మద్‌ రఫీపై కూడా దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం అర్బన్‌ సీఐ జి.రాజు, ఎస్‌ఐ మహహ్మద్‌రఫీ వెతికే సమయంలో..  గురువారం ఉదయం రాయచోటి – గాలివీడు రోడ్డులోని పెట్రోల్‌ బంకు సమీపంలో ఉన్నట్లు సమాచారం వచ్చింది. వారు అక్కడికి వెళ్లి అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. 

ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
సుండుపల్లె మండలం పెద్దగొల్లపల్లె బుట్టిమాని వెంకటమణ కుమారుడు తిమ్మయ్య (35),  బుట్టిమాని రెడ్డెయ్య కుమారుడు తిమ్మయ్య, రెడ్డిచెర్ల వెంకటస్వామి కుమారుడు రామకృష్ణ స్నేహితులు. వీరు ముగ్గురూ కలిసి అప్పుడప్పుడూ మద్యం తాగేవారు. బుట్టిమాని వెంకటమణ కుమారుడు తిమ్మయ్య, బుట్టిమాని రెడ్డెయ్య కుమారుడు తిమ్మయ్య దాయాదులు. వెంకటమణ కుమారుడు తిమ్మయ్య, రెడ్డెయ్య కుమారుడు తిమ్మయ్యకు తమ్ముడు అవుతాడు. వారిద్దరి పేరు తిమ్మయ్యనే. వారి మధ్య భూ వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 7న రామకృష్ణ ఇంటిలో మద్యం తాగారు. మద్యం తాగే సమయంలో ఇద్దరు తిమ్మయ్యలు ఆస్తి వివాదంపై మాట్లాడారు. వారి మధ్య మాటకు మాటా పెరిగింది. రెడ్డెయ్య కుమారుడు తిమ్మయ్యకు రామకృష్ణ మద్దతుగా నిలిచారు. కోపం కట్టలు తెంచుకున్న అన్న.. రామకృష్ణ ఇంటిలో రోకలిబండ తీసుకొని తమ్ముడి తలపై బలంగా మోది హత్య చేశారు. హత్యా నేరం నుంచి తప్పించుకునేందుకు ఉపాయం వేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. మృతదేహానికి మృతుడి లుంగీని మెడకు చుట్టి, ఈడ్చుకెళ్లి రెడ్డిచెర్ల ఇంటికి ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన రామవాండ్లపల్లె క్రాస్‌ వద్ద పడేశారు. సంఘటన స్థలంలో ఉన్న ఆధారాల ప్రకారం అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కేసు ఛేదించేందుకు రాయచోటి రూరల్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై భక్తవత్సలం ప్రయత్నించారు. రాయచోటి – రాజంపేట రోడ్డులోని సుండుపల్లెకు వెళ్లే దారిలో మర్రిమాను సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద తిమ్మయ్య, రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా.. మద్యం మత్తులో హత్య తామే చేశామని ఒప్పుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పెడుతున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్‌ సీఐ జి.రాజు, ఎస్‌ఐ మహహ్మద్‌రఫీ, రూరల్‌ సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై భక్తవత్సలం, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా