ఒడిశా కూలీల అనుమానాస్పద మృతి 

6 May, 2020 08:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వెల్దుర్తి: మండలంలోని రత్నపల్లె సమీపంలోని రెండు వేర్వేరు ఇటుకల బట్టీలలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు వలస కూలీలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.  పోలీసులు, తోటి కూలీల కథనం మేరకు.. నరసింహుడు అనే వ్యక్తికి చెందిన ఇటుకల బట్టీలో ఒడిశా రాష్ట్రం బలంగిర్‌ జిల్లాకు చెందిన నీలో మాఝి(40) ఒంటరిగా వచ్చి ఆరు నెలలుగా పనిచేస్తున్నాడు. ఇతను అక్కడే చిన్నపాటి గదిలో ఉండేవాడు. సోమవారం రాత్రి పడుకున్న ఇతన్ని మంగళవారం తెల్లవారు జామున నిద్ర లేపేందుకు తోటి కూలీలు వెళ్లగా విగతజీవిగా కనిపించాడు.

అలాగే ఆ బట్టీకి అర కి.మీ దూరంలోని రమేశ్‌ అనే వ్యక్తికి చెందిన ఇటుకల బట్టీలో ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాకు చెందిన తారాచంద్‌ మాఝి (36) పనిచేస్తున్నాడు. ఇతను ఇద్దరు కుమార్తెలను స్వగ్రామంలోనే ఉంచి, భార్య కపూరితో కలిసి ఐదు నెలల క్రితం ఇక్కడికి వచ్చాడు. తోటి కూలీలతో కలిసి సోమవారం రాత్రి నిద్రించిన ఇతను విగతజీవిగా మారడాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించారు. చెవిలో రక్తం వచ్చింది. విషయం తెలుసుకున్న డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి, రూరల్‌ సీఐ సుధాకర్‌ రెడ్డి, వెల్దుర్తి ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ రెడ్డి సంఘటన స్థలాలను పరిశీలించారు.

మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం డోన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  డోన్‌ డివిజన్‌ అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు వచ్చి వివరాలు సేకరించారు. రెండు ఇటుకల బట్టీలలో ఒకే రాష్ట్ర వాసులు ఒకేరోజు, ఒకే విధంగా మృతిచెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    

మరిన్ని వార్తలు