పింఛన్‌ కోసం వెళ్తే ప్రాణాలే పోయాయి..

6 Feb, 2019 10:31 IST|Sakshi
రోడ్డు పక్కన విగతజీవిగా పడి ఉన్న బ్రహ్మారెడ్డి

గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 

ఇద్దరు వృద్ధుల మృతి

సాక్షి, గుంటూరు మెడికల్‌/తాళ్లరేవు (ముమ్మిడివరం): పింఛన్‌ కోసం కాళ్లరిగేలా తిరిగి విసిగి వేసారిన ఇద్దరు వృద్ధులు మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. గుంటూరుకు చెందిన మోర బ్రహ్మారెడ్డి (70), తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిగొంది గ్రామానికి చెందిన దంగేటి నీలాద్రి (72) మృత్యువాత పడ్డారు. గుంటూరు నగరంలోని గుంటూరువారితోట నాలుగో లైనుకు చెందిన మోర బ్రహ్మారెడ్డి 3 రోజులుగా వృద్ధాప్య పింఛన్‌ కోసం తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 9.30 గంటలకు పింఛన్‌ కోసం స్కూల్‌ వద్దకు వెళ్లిన బ్రహ్మారెడ్డి తనకు ముందు వరుసలో చాలా మంది ఉన్నారని మళ్లీ ఇంటికి బయలుదేరాడు. స్కూల్‌ దాటి ఓల్డ్‌క్లబ్‌ రోడ్డులోని ప్రధాన రహదారిలో ఉన్న తులసి ఆస్పత్రి వద్దకు రాగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు తులసి హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. 

తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిగొందిలోనూ.. 
తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ ప్రత్తిగొందికి చెందిన దంగేటి నీలాద్రి పింఛను తీసుకునేందుకు ఉదయం పంచాయతీ కార్యాలయానికి వెళ్లాడు. అయితే ఎంతకీ పేరు రాకపోవడంతో మధ్యాహ్నం వరకు అక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలోనే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అధికారులు మృతదేహాన్ని ఆటోలో ఇంటికి పంపించివేసి చేతులు దులుపుకున్నారు. గంటల తరబడి వేచి ఉండడం వల్లే నీలాద్రి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు